'కేడి' కొలాప్స్?
నాగార్జున కథానాయకుడుగా కిరణ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేడి' ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన పెద్ద చిత్రాల్లో ఓ డిజాస్టర్ గా మిగలబోతోందని ట్రేడ్ టాక్. కొత్త దర్శకులు, కథలతో ప్రయోగాలు చేయడంలో నాగార్జున తన కెరీర్ తొలినాళ్ల నుంచి ఎప్పుడూ ముందుంటూనే ఉన్నారు. అప్పట్లోనే 'నిర్ణయం', 'సంకీర్తన', 'గీతాంజలి' వంటి ప్రయోగాలు చేశారు. ఇందులో కొన్ని సక్సెస్ మరికొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ఆయన తను నమ్మిన పంథా నుంచి ఎప్పుడూ వెనక్కి మళ్లలేదు. భక్తిరస చిత్రాలకు కాలం చెల్లిందని అంతా అనుకుంటున్న తరుణంలో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలు తీసి తన కెరీర్ లోనే 'ది బిస్ట్' చిత్రాలుగా వాటిని నిలిపారు. తాజాగా ఆయన కిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నటించిన తాజా ప్రయోగం 'కేడి' మాత్రం వికటించిందని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి. నాగ్ తనపై ఉంచిన నమ్మకాన్ని యువదర్శకుడు కిరణ్ నిలబెట్టడంలో విఫలమయ్యారనీ, ఎంటర్ టైన్ మెంట్ కు మంచి అవకాశం ఉన్నా ప్రెజెంటేషన్ లో గందరగోళం సృష్టించారని నాగ్ అభిమానులు ఆయనను బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఏకైక పెద్ద చిత్రం ఇదే అయినప్పటికీ ఆ పరిస్థితిని సరిగా క్యాష్ చేసుకోలేకపోతోందని వారు వాపోతున్నారు.
నాగార్జున ఇటీవల చిత్రాలను విశ్లేషిస్తే ఆయన నటించిన 'డాన్' మొదట్లో సరైన టాక్ తెచ్చుకోనప్పటికీ క్రమంగా హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'కింగ్' హిట్టయితే, మధ్యలో వచ్చిన 'బాస్' చతికిల పడింది. తాజాగా 'కేడి' సైతం ఆ కోవలోకే చేరినట్టు విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ఈ చిత్రం తొలి ప్రదర్శన నుంచి నెగిటివ్ టాక్ ప్రచారం కావడం కూడా సినిమా ఫలితాన్ని మరింత కుదేలు చేసిందంటున్నారు. నాగార్జున ఇంతవరకూ 'కేడి' ఫలితంపై ప్రత్యక్షంగా పెదవి విప్పనప్పటికీ పరోక్షంగా మాత్రం తన కుమారుడు నాగచైతన్య 'ఏమాయ చేసావే' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజానికి ఈ రెండు చిత్రాల మధ్య ఓ నెలరోజుల గ్యాప్ ఇవ్వాలనుకున్న నాగార్జున ఇప్పుడు మనసు మార్చుకుని 'ఏమాయకు...' దారి ఇవ్వడంతో 'కేడి' ఫలింత నాగ్ ను సైతం నిరాశ పరిచినట్టుగా చెప్పుకుంటున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|