నృత్య దర్శకుడుగా దాసరి
దర్శక రత్న దాసరినారాయణరావు ఇప్పుడు మరో విభాగంలోనూ తన ప్రతిభను చాటుకోబోతున్నారు. తాజాగా ఆయన 'యంగ్ ఇండియా' చిత్రం కోసం కొరియోగ్రాఫర్ గా కూడా మారారు. దాసరి దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రమిది. దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా 81 మంది తెలుగు నటీనటులను దాసరి వెండితెరకు పరిచయం చేస్తున్నారు.
కథా రచయితగా తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన దాసరి స్క్రీన్ ప్లే రచయితగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడిగా ఇలా అంచెలంచెలుగా ఎదిగారు. ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశారు. తాజాగా ఆయన నృత్య దర్శకుడుగా కొత్త అవతారం ఎత్తి 'యంగ్ ఇండియా'లోని పాటలకు నృత్యరీతులు కూర్చారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కథ-మాటలు-స్క్రీన్ ప్లే కూడా అందిస్తుండగా, సి.హెచ్.రమణరాజు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|