వాస్తవాలకు అద్దం 'కాఫీబార్'
నేటి సమకాలీన సహజ సంఘటనలకు అద్దం పట్టే విధంగా 'కాఫీబార్' చిత్రాన్ని దర్శకుడు గీతాకృష్ణ మలిచారు. గతంలో 'సంకీర్తన', 'కోకిల', 'కీచురాళ్లు' వంటి వైవిధ్యమైన చిత్రాలకు గీతాకృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన బ్లూఫాక్స్ పతాకంపై 'కాఫీబార్'ను తెరకెక్కంచారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
చిత్ర విశేషాలను గీతాకృష్ణ తెలియజేస్తూ, మానవులంతా తమ మేథస్సును చెడుకు కాకుండా మంచికి ఉపయోగిస్తే సమాజం సుఖశాంతులతో ప్రగతి పథంలోకి దూసుకు వెళ్తుందనే అంశాన్ని ఇందులో చెబుతున్నామని అన్నారు. మానవుని మైండ్ పవర్ చాలా విస్తృతమైనదనీ, అయితే సహజంగా సాధారణ తెలివితేటలున్న వ్యక్తి .25 (పాయింట్ 25) మైండ్ పవర్ మాత్రమే ఉపయోగిస్తుంటాననీ, అయితే మరో .25 పవర్ ను అదనంగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చనీ ఆయన తెలిపారు. శాస్త్రవేత్తలు మైండ్ పవర్ ను 10 వరకూ ఉపయోగించుకుంటారని అన్నారు. వాస్తవ సంఘటనలకు అద్దంపట్టే ఈ చిత్రంలో ఇటీవల పునేలోని జర్మన్ బేకరీలో జరిగిన పేలుళ్ల సంఘటనను కూడా చేర్చినట్టు చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తీశామనీ, హిందీలో అనువదిస్తామనీ చెప్పారు. ఐపిఎల్ పోటీలు, విద్యార్థుల పరీక్షల అనంతరం ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో శశాంక్, బియాంక దేశాయ్, అతుల్ కులకర్ణి, గిరీష్ కర్నాడ్, బేబి శివానీ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|