ఉపేంద్ర-తార త్రిభాషా చిత్రం
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కన్నడంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన రాక్ లైన్ ప్రొడక్షన్స్ అధినేత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ రూపొందిస్తున్న 25వ చిత్రమిది. ఉపేంద్రకు జోడిగా నయనతార ఇందులో నటిస్తోంది. ఈనెల 18న బెంగుళూరులో చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఎగ్జిబిటర్ ఆనంద్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత మునిరత్న కెమెరా స్విచ్చాన్ చేశారు.
రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ, 'ఉపేంద్ర' చిత్రం తర్వాత సుమారు పదేళ్ల గ్యాప్ తీసుకుని ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదనీ, అది కూడా తమ సంస్థలో చేయడం ఆనందంగా ఉందనీ అన్నారు. తమ బ్యానర్ లో ఉపేంద్ర హీరోగా రెండు సినిమాలు తీశామనీ, ఇప్పుడు ఈ హ్యాట్రిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామనీ చెప్పారు. యాక్షన్, మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, ఇందులో ధనవంతుడైన యువకుడిగా ఉపేంద్ర నటిస్తున్నారనీ తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కోట్లాది రూపాయల వ్యంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తామన్నారు. కథకు సరిగ్గా నయనతార సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశామనీ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, లండన్, ముంబైలలో చిత్రం షూటింగ్ జరుపుతామని తెలిపారు. ఇందులో 5 పాటలు ఉంటాయనీ, ఏప్రిల్ నెలలో హైద్రాబాద్ లో షూటింగ్ ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రంలో సాయాజీ షిండే ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు జానీలాల్ సినిమాటోగ్రఫీ, హరికృష్ణ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|