దివికేగిన హాస్య 'పద్మం'
నవరసాల్లో హాస్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆరున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమాకు లెక్కలేనన్ని నవ్వులు పంచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించడంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సినీ స్వర్ణయుగం నాటి ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. కళాకారుడుగా తాను వచ్చిన పని అయిపోయిందంటూ అఖిలాంధ్ర ప్రేక్షకులను విషాదంలో ముంచి...కేవలం తన నవ్వులను మాత్రమే మిగిల్చి తిరిగిరాని లోకానికి తరలిపోయారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కడప జిల్లా పులివెందుల తాలుక సింహాద్రిపురంలో శాంతం, బసవరాజు వెంకట శేషయ్య దంపతులకు 1931 ఆగస్టు 20న పద్మనాభం జన్మించారు. ఆయన అసలు పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. చిన్నతనం నుంచి రంగస్థలం అంటే ఆయనకు తగని మక్కువ కావడంతో చదవు పెద్దగా సాగలేదు. సినిమాల్లో చేరాలనే పట్టుదలతో ఆయన చిన్నతనంలోనే మద్రాసు వెళ్లారు. అక్కడ ప్రముఖ నటి, నిర్మాత కన్నాంబను కలుసుకున్నారు. అప్పట్లో ఆమె 'పాదుకా పట్టాభిషేకం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలోని 'పడవెళ్లిపోతోంది' అనే పాటకు కోరస్ సింగర్ గా పద్మనాభంకు అవకాశం లభించింది. కొద్దికాలం అక్కడే ఉన్న పద్మనాభం తొలిసారి 'మాయాలోకం' చిత్రంతో బాలనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. అప్పడు ఆయన వయస్సు కేవలం 13 ఏళ్లే. ఆ చిత్రానికి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 'త్యాగయ్య', 'ముగ్గురు మరాఠీలు', 'నారద నారది', 'యోగివేమన' వంటి చిత్రాల్లో నటించారు. అయితే 'పాతాళ భైరవి' చిత్రం పద్మనాభానికి సరైన బ్రేక్ ఇచ్చింది. నేపాలీ మాంత్రికుడు ఎస్.వి.రంగారావు శిష్యుడుగా ఇందులో ఆయన నటించారు. అప్పట్నించి ఆయన తిరిగి చూసుకోలేదు. సుమారు 400 సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో పద్మనాభం నటించారు. పౌరాణిక పాత్రల్లో నారదుడి వేషం ఆయనకు మంచి పేరు తెచ్చింది. 'సతీ తులసి', 'ప్రమీలార్జునీయం', 'శ్రీరామకథ', 'కృష్ణలీలలు' వంటి చిత్రాల్లో ఆయన నారదుడి పాత్ర పోషించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|