దివికేగిన హాస్య 'పద్మం'
నిర్మాత-దర్శకుడిగా
నటుడిగానే కాకుండా చక్కటి అభిరుచి గల నిర్మాత, దర్శకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టనర్ గా ఉంటూ 'రేఖ అండ్ మురళి' అనే బ్యానర్ ను పద్మనాభం స్థాపించారు. తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన'దేవత' (1964) చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 'పొట్టి ప్లీడర్', 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న', 'శ్రీరామకథ', 'కథానాయిక మొల్ల' చిత్రాలను ఆయన నిర్మించారు. 'శ్రీరామకథ', 'కథానాయిక మొల్ల' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు కూడా. 'కథానాయిక మొల్ల' చిత్రానికి బంగారు నంది వచ్చింది. ప్రతిభ ఎక్కడ ఉన్నా వెలికితీసి వారిని ప్రోత్సహించడంలో పద్మనాభం ముందుండే వారు. ఆయన చిత్రాలన్నింటికీ వీటూరి పనిచేశారు. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతోనే ఎస్.పి.బాలసుబ్రమణ్యంను గాయకుడిగా పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే.
నటుడిగా ఎన్ని సక్సెస్ లు సాధించించినప్పటికీ రంగస్థలంపై ఉన్న మమకారంతో ఆయన వల్లం నరసింహారావుతో కలిసి ఓ ట్రూప్ ను కూడా ఏర్పాటు చేశారు. చక్కటి గాత్రం పద్మనాభం సొంతం. వయసు పైబడినప్పటికీ ఆయన గాత్రమాధుర్యం నిన్నటి వరకూ చెక్కుచెదరలేదు. 52 ఏళ్లుగా ఆయన యోగాభాస్యంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఆర్థికంగా చితికిపోవడంతో పరిశ్రమకు చెందిన పలువురు ఆయనకు ఆర్థిక సహాయం కూడా అందించారు. వయోభారం మీద పడినా అడపాదడపా తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కొన్ని చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై కూడా కనిపించారు. చివరి సారిగా 'చక్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా' వంటి చిత్రాల్లో ఆయన నటించారు. సినీ నటుడుగా, రంగస్థల నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా బహుముఖ ప్రతిభ చూపిన పద్మనాభం తెలుగు సినిమాల్లో హాస్యం ఉన్నంత వరకూ చిరస్మరణీయుడుగానే మిగులుతారు. ఆయననను మన మదిలో పదిలంగా మిగుల్చుకోవడమే ఆయనకు చివరిసారిగా ఇచ్చే ఘన నివాళి అవుతుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|