కె.విశ్వనాథ్ చిత్రం ప్రోగ్రస్
'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం' వంటి ఎన్నో కళాత్మక చిత్రాలను అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఓ కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చెరుకూరి కౌశలేంద్రరావు ఆశీస్సులతో శ్రీ రాజరాజేశ్వరి సోమేశ్వర ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీస్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. హరిగోపాల కృష్ణమూర్తి, పీల నీల తిలక్ నిర్మాతలు. ఈ చిత్రం తొలి షెడ్యుల్ పూర్తయింది. ప్రస్తుతం గుంటూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. శుక్రవారం విశ్వనాథ్ బర్త్ డే కూడా కావడంతో చిత్రయూనిట్ ఇక్కడే ఆయన పుట్టినరోజు వేడుక నిర్వహించి విశ్వనాథ్ దంపతులను సన్మానించింది.
విశ్వనాథ్ మాట్లాడుతూ, ఈ చిత్రం లైట్ ఎంటర్ టైనర్ అనీ, తన స్టయిల్ లోనే ఈ సినిమా ఉంటుందనీ చెప్పారు. మొదటి షెడ్యూల్ లో భాగంగా 5 రోజుల పాటు హైద్రాబాద్ లో షూటింగ్ జరిపి ఆ తర్వాత అన్నవరం వెళ్లామనీ, ఈనెల 1 నుంచి 15 వరకూ అక్కడ 3 పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు తీసామనీ చెప్పారు. అనంతరం గుంటూరులో రెండు రోజుల షూటింగ్ జరుపుతున్నామని అన్నారు. తదుపరి షూటింగ్ కేరళలో ఉంటుందని చెప్పారు. తాను గతంలో తీసిన 'శుభోదయం', 'సీతామాలక్ష్మి' చిత్రాల కోవలో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇందులో అల్లరి నరేష్ పాత్ర చాలా అల్లరిగా, సరదాగా సాగుతుందనీ, తన గత చిత్రాల మాదిరిగానే సంగీతం, సాహిత్యాల మేళవింపు ఇందులోనూ ఉంటుందని చెప్పారు. దర్శకుడుగా గ్యాప్ తీసుకున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు, దర్శకుడిగా అస్త్రసన్యాసం చేస్తున్నట్టు అప్పట్లో చెప్పాననీ, ఆరోగ్యం, కథ కుదరడం వంటివన్నీ ఇందుకు కారణాలు అవుతాయనీ, ఇప్పుడు అన్నీ కుదరడంతో మళ్లీ దర్శకత్వం వహిస్తున్నాననీ అన్నారు. వైజాగ్ కు చెందిన తనకు విశ్వనాథ్ వంటి దిగ్గదర్శకుడి చిత్రాన్ని నిర్మించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్టు పీల నీల తిలక్ తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో 'స్వరాభిషేకం' తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని హరిగోపాల కృష్ణమూర్తి అన్నారు. టి.సాయినాథ్ రచనా సహకారం అందిస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల-అనంత్ శ్రీరామ్-రాంభట్ల నృసింహ శర్మ సాహిత్యం, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|