రజనీకాంత్ కు ప్రాణభయం?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రాణభయం పట్టుకుందా? అవుననే మీడియాలో కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. 'చంద్రముఖి' చిత్రంలో నటించడంతో కనిపించని ఆ అదృశ్య శక్తి ఏదో తనకు కూడా కీడు తలపెడుతుందేమోనని రజనీకాంత్ గుండె 'లకలక'లాడుతోందట. ఇందుకోసం ఆయన మహా రుద్రాభిషేక పూజలు, ఇతర శాంతి హోమాలు కూడా జరిపిస్తున్నారట.
పి.వాసు దర్శకత్వంలో కన్నడంలో 'ఆప్తమిత్ర' చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో నటించిన సౌందర్య అప్పట్లో విమాన ప్రమాదంలో కన్నుమూసింది. ఆ తర్వాత ఆ చిత్రం తమిళంలో రజనీకాంత్ తో 'చంద్రముఖి'గా రీమేక్ అయింది. ఇదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది.'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్ గా మళ్లీ కన్నడంలో 'ఆప్త రక్షక' చిత్రాన్ని ఇటీవల వాసు తీశారు. ఈ శుక్రవారమే ఆ చిత్రం విడుదలైంది. అనూహ్యంగా ఈ చిత్రంలో హీరోగా నటించిన విష్ణువర్దన్ ఇటీవలే కన్నుమాశారు. 'చంద్రముఖి-2'గా ఈ చిత్రాన్ని తమిళంలో తీసేందుకు కొద్దికాలంగా రజనీకాంత్ ను నచ్చజెప్పే ప్రయత్నం వాసు చేస్తున్నప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. ఇటీవలే చెన్నైలో 'ఆప్తరక్షక' ప్రివ్యూ చూసిన రజనీకాంత్ తనకు ఆప్తుడు, స్నేహితుడు అయిన విష్ణువర్దన్ ను తెరపై చూసి కంటతడిపెట్టారు. అయితే 'చంద్రముఖి' సీక్వెల్ లో నటించేందుకు మాత్రం ఆయన ఇంకా కమిట్ కాలేదు. నిన్న 'అప్తమిత్ర' లో నటించిన సౌందర్య, నేడు 'ఆప్త రక్షక'లో నటించిన విష్ణువర్దన్ మరణించడంతో రజనీకి 'చంద్రముఖి' అంటేనే భయం పట్టుకుందనీ, అందులో నటించిన వారిని చావు వెన్నాడుతోందనే భయం ఆయనలో నెలకొందనీ ప్రచారం జరుగుతోంది. దోష నివారణ కోసం రజనీకాంత్ ఇటీవల కొన్ని పూజలు, హోమాలు కూడా చేయించినట్టు చెబుతున్నారు. అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టంటేనా, ఇందులో నిజం ఎంత ఉందనేది రజనీకాంత్ ఇంతవరకూ ధ్రువీకరించలేదు. ఇవి కేవలం అసత్య ప్రచారమేననీ, కన్నడ వెర్షన్లలో నటించిన సౌందర్య, విష్ణువర్దన్ లు కన్నుమూసినప్పటికీ, ఆ చిత్రానికి ఒరిజనల్ వెర్షన్ అయిన మలయాళ 'మణిచిత్రతాళ్', తమిళ 'చంద్రముఖి' చిత్రాల్లోని కీలక పాత్రధారులు నిక్షేపంగా ఉన్నారనీ చెబుతూ మరికొందరు ఈ పుకార్లను తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|