'పద్మనాభం మృతి తీరనిలోటు'
సీనియర్ హాస్య నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం కన్నుమూయడంలో సినీ స్వర్ణయుగం నాటి గొప్ప కళాకారుడు, మంచి వ్యక్తి, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయామంటూ పలువురు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పెద్ద దిక్కును కోల్పోయాం: చంద్రబాబు
తెలుగు, తమిళ భాషల్లో 700కు పైగా చిత్రాల్లో పద్మనాభం నటించారు. నటరత్న ఎన్టీఆర్ తో అనేక సినిమాలతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్ తో ఆయన నిర్మించిన 'దేవత' చిత్రం ఓ మైలురాయిగా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. 'కథానాయిక మొల్ల', 'దేవత', 'పొట్టిప్లీడర్', 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. 'కథానాయిక మొల్ల' చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంతో సహా ఎందరో వర్దమాన కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. హాస్యనటుడిగానే కాకుండా, నిర్మాతగా దర్శకునిగా, యోగసాధకునిగా పలు విభాగాల్లో అభినివేశం ఉన్న పద్మనాభం మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. పరిశ్రమ ఓ పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
చిరకాల అనుబంధ: అక్కినేని
నా రెండో సినిమా పద్మనాభానికి మొదటి సినిమా. అప్పట్నించి మా ఇద్దరి అనుబంధం కొనసాగుతూ వచ్చింది. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం. సీనియర్ ఆర్టిస్టులంటే ఎంతో గౌరవమున్న వ్యక్తి ఆయన. ఆయన లేని లోటు పూడ్చలేం. పద్మనాభం కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
ఆయనది 'తేనె మనసు': కృష్ణ
నా తొలి చిత్రం 'తేనె మనసులు'లో పద్మనాభం నటించారు. అందులో ఆయన ఓ పాట కూడా పాడారు. ఆ తర్వాత కూడా ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాం. ఆయనతో నటించడం చాలా గర్వంగా ఉండేది. మంచి మనిషి. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు.
కలిసి నటించాం: విజయనిర్మల
పద్మనాభం మనసున్న మంచి మనిషి. 'ఆత్మీయులు' చిత్రంలో ఆయనతో నటించాను. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో కలిసి నటించాం. ఈమధ్యనే ఆయనకు జరిగిన సన్మానంలో ఆయనకు కలుసుకుని క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాను. ఇంతలోనే ఆయన లేరనే వార్త తెలిసి జీర్ణించుకోలేకుండా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మా కుటుంబంలో వ్యక్తి: రామానాయుడు
'శ్రీకృష్ణ తులాబారం' నుంచి మా సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. మా కుటుంబంలో ఓ సభ్యుడిగా ఆయన మెలిగేవారు. ఆయన వంటి మంచి నటుడు, మంచి వ్యక్తిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.
ఆ అదృష్టం నాకు దక్కింది: ధర్మవరపు
పద్మనాభం వంటి సీనియర్ ఆర్టిస్టుతో పలు సినిమాల్లో నటించాను. అయన చేత టీవీల్లో నటింపజేసే అవకాశం నాకు కలిగింది.
అది నా అదృష్టంగా భావిస్తాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
స్వర్ణయుగం నటుడు: మా
తెలుగు సినిమా స్వర్ణయుగం నాటి ప్రముఖ నటుడు పద్మనాభం. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా సినీ పరిశ్రమకు అంకితమైన కళాకారుడు ఆయన. పరిశ్రమ ఒక గొప్ప కళాకారుడ్ని కోల్పోయింది. ఆయన లోటు లేని భర్తీ చేయలేం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.
Be first to comment on this News / Article!
|