వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్
తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే ఇతివృత్తంతో వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ అనే నూతన నిర్మాణ సంస్థ ఓ కొత్త చిత్రాన్ని వైజాగ్ లోని రామనాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. రమేష్ బి.నాయుడు దర్శకత్వంలో అనిల్ కుమార్ మజ్జి, సంతోష్ కుమార్ బడ్లకొండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాతల్లో ఒకరైన అనిల్ కుమార్ మజ్జి మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరికీ తెలియజేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. కథాపరంగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆస్థాన వ్యవహారాలు చూసే గోవిందరాజులు కుటుంబం ఒకటి ఆది నుంచి తిరుమలలో ఉంటుంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే స్వామి వారి ఆలయ వ్యవహారాలు చూస్తుంటారు. ప్రస్తుతం స్వామి వారి వ్యవహారాలు చూస్తున్న ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో కొద్దిగా వివాదాస్పద పాయింట్ ఉన్నప్పటికీ ఎవ్వరినీ నొప్పించదనీ, తమ సంస్థకు ఈ చిత్రం తప్పనిసరిగా మంచి గుర్తింపు తెస్తుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో మేల్కొటి, రమేష్ బి.నాయుడు, అప్పాజి ('అమృతం' సీరియల్ ఫేమ్), హరితేజ (హీరోయిన్) విజయ్ రాజ్, విజయ్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం రమేష్ బి నాయుడు అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ కెమెరా, బాబినాయుడు సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|