ఏవియస్ 'కోతిమూక' షురూ
కృష్ణుడు, శ్రద్ధఆర్య జంటగా ప్రముఖ హాస్యనటుడు ఏవియస్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'కోతిమూక'. నూతన చలనచిత్ర నిర్మాణ సంస్థ తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారం జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ ఇవ్వగా, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. 'మా' అధ్యక్షుడు ఎం.మురళీమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చేతుల మీదుగా చిత్రం స్క్రిప్టును ఏవియస్ అందుకున్నారు.
ఏవీయస్ మాట్లాడుతూ, దర్శకుడిగా తనకిది నాలుగో చిత్రమనీ, మొదటి మూడు చిత్రాలు ఒక దర్శకుడిగా తనకు సంతృప్తి నిచ్చినా కమర్షియల్ సక్సెస్ కాలేదనీ అన్నారు. ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ అంశాలతో చేస్తున్నామనీ, నిర్మాతలు మంచి అభిరుచి ఉన్నవారనీ అన్నారు. జనార్ధన మహర్షి ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రిప్టు ఇచ్చారనీ, మణిశర్మ సంగీతంలో ఇప్పటికే ఐదు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందనీ చెప్పారు. ఇందులో ఘంటస్వాల స్వరపరచిన 'బందిపోటు' చిత్రంలోని 'ఊహలు గుసగుసలాడే' అనే పాటను రీమిక్స్ చేసి ఘంటసాల రత్నకుమార్ తో పాడించినట్టు చెప్పారు. రావణాసురిడి దుమ్ము రేపేందుకు కోతిమూక సాయంత రాముడు చేసిన యుద్ధమే టూకీగా ఈ చిత్ర కథాంశమని చెప్పారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ, 55 రోజుల పాటు హైద్రాబాద్ పరిసరాల్లో జరిపే షూటింగ్ తో నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. వీలును బట్టి రెండు పాటలు విదేశాల్లో చేస్తామని అన్నారు. కామెడీతో పాటు మంచి సెటీర్ కూడా ఇందులో ఉంటుందని జనార్ధన మహర్షి తెలిపారు. ఈ చిత్రానికి అవార్డులు కూడా ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మంచి ఆర్టిస్టుల కాంబినేషన్ లో ఈ చిత్రం చేస్తుండటం సంతోషంగా ఉందని కృష్ణుడు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన తనకు నిర్మాతగా ఇది తొలి చిత్రమని వెంకట్ జగదీష్ చెప్పారు. కథానాయిక శ్రద్ధాఆర్య, హేమ, గుండు హనుమంతరావు, కొండవలస, చిట్టిబాబు, అనంత్, జెన్నీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, వేణుమాధవ్, ఆహుతిప్రసాద్, రఘబాబు, జీవీ, హర్షవర్దన్, కోవైసరళ, ఝాన్సీ తదితరులు నటించనున్నారు. శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|