దర్శకుడు సుకుమార్ 'స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్' అనే పాలసీని నమ్ముతుంటారు. 'ఆర్య' సక్సెస్ తర్వాత చాలాకాలానికి 'జగడం' చిత్రం చేశారు. ఆ చిత్రం ఫెయిల్ కావడంతో కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ 'ఆర్య-2'తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలంగాణలో ఆందోళన కారణంగా సినిమాకు దెబ్బపడినా ఓవరాల్ గా ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ అనిపించుకుంది. ఇప్పుడు సుకుమార్ ఆలోచనలోనూ మార్పు వచ్చిందట. ఇక ముందు ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమా చేయాలనే ఆలోచనలో తాజాగా ఓ రొమాంటింక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో నాగచైతన్య కథానాయకుడిగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారని తెలుస్తోంది.
తొలి చిత్రం 'జోష్' నాగచైతన్యను నిరాశపరచినప్పటికీ ఆయన గ్యాప్ లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. 'జోష్' విడుదలకు ముందే గౌతమ్ దర్శకత్వంలో 'ఏమాయ చేసావే' చిత్రం నాగచైతన్యతో ప్రారంభమైంది. ఆ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. దీని తర్వాత మార్చి నుంచి నాగచైతన్య-కాజల్ జంటగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. నాలుగో చిత్రంగా సుకుమార్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ చిత్రం ఉండబోతోంది.