3డి ఎఫెక్ట్ లో 'రోబో'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రోబో' ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది. 125 కోట్లకు పైబడిన భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతవరకూ 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి తాజాగా '3 డి' ఎఫెక్ట్ కూడా జోడించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల తాజా భోగట్టా. ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి '3డి' హంగులు జోడిస్తే మరో వెండితెర అద్భుతాన్ని శంకర్ ఆవిష్కరించినట్టేనని అంటున్నారు. ఇందుకోసం హాలీవుడ్ నిపుణులతో కూడా శంకర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించిన ఇతివృత్తం ఇంతవరకూ బయటకు పొక్కకుండా శంకర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో రజనీకాంత్ సైటింస్ట్ గా, రోబోగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, రోబో లవ్ ఇంట్రెస్ట్ గా ఐశ్వర్య పాత్ర ఉంటుందనీ తెలుస్తోంది. రజనీకాంత్ తో ఐశ్వర్య నటిస్తున్న తొలిచిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి ఆస్కార్, గ్రామీ అవార్డుల విజేత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|