నిఖిల్ యుఎస్ డిస్ట్రిబ్యూషన్
'హ్యాపీడేస్'లో ఒక హీరో రాజేష్ గా నటించిన యువహీరో నిఖిల్ 'అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్', 'యువత' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన సోలో హీరోగా నటించిన 'కళవర్ కింగ్' చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ద్వారా నిఖిల్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెడుతుండటం విశేషం. సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఎంతగానో నచ్చడంతో అఖిల్ తొలిసారి ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్నారు. అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల్లో ఈ చిత్రాన్ని ఆయన పంపిణీ చేయనున్నారు.
నిఖిల్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పణలో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎం.చంద్ర శేఖర్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. హీరో నిఖిల్, విలన్ పాత్రధారి అజయ్ లపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనీ, ఆ ఇద్దరూ పోటీపోటీగా నటించారనీ నిర్మాతలు చెబుతున్నారు. అలాగే శ్వేతబసు గ్లామర్ తో కూడిన అభినయం, కామెడీ ట్రాక్, అనిత ('నువ్వు నేను' ఫేమ్) ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. 70 శాతం వినోదం, 30 శాతం సెంటిమెంట్ మేళవించిన ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్, ఆలీ, రఘబాబు, విశ్వనాథ్ కాశీ, గౌతంరాజు, ప్రగతి, సుమన్ శెట్టి తదితరులు నటించారు. చందు సంభాషణలు, అనిల్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|