'డ్రగ్' ఉచ్చులో తారలు?!
ఎపిడ్రిన్ మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ సినీ నిర్మాత కె.వెంకటేశ్వరరావు, శ్యామ్ రాజ్ రెండ్రోజుల క్రితం పోలీసులకు చిక్కడంతో ఈ డ్రగ్ మాఫియా వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరి ప్రమేయం కూడా ఉండొచ్చనే దిశగా దర్యాప్తు జరుగుతోంది. కె.వి.రావు, శ్యామ్ రాజ్ లను సోమవారంనాడు రిమాండ్ కు పంపి విచారణ జరుపుతుండటంతో ఎవరెవరికి ఇందులో ప్రమేయం ఉంది, ఎవరికి ఈ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కారుతో పట్టుబడిన కె.వి.ఆర్. కొందరి పేర్లను బయటపెట్టినట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ యువహీరో, ఓ మాస్ హీరో తమ్ముడి ప్రమేయం కూడా ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. సదరు యువ హీరో నడిపే పబ్ కు ప్రతినెలా కొన్ని డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారని సమాచారం. అలాగే ఓ మాస్ హీరో సోదరుడి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మాఫియా వ్యవహారంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు ఏదైనా ప్రమేయం ఉందా అనే విషయంపై పోలీసులు తొలుత ఆరా తీశారు. డ్రగ్స్ తో సహా పట్టుబడిన కారునే ఇటీవల 'శంభో శివ శంభో' చిత్రం కోసం బెల్లంకొండ వాడినట్టు పోలీసుల విచారణలో తేలడంతో ఆయనపై అనుమానం మళ్లింది. అయితే బెల్లంకొండ సురేష్ దీనిపై వివరణ ఇస్తూ, చిన్న నిర్మాత అయిన ప్రకాష్ అనే వ్యక్తి ద్వారా ఆ కారును అద్దెకు తీసుకున్నామనీ, ఈ మాఫియా వ్యవహారంతో తనకెలాంటి ప్రమేయం లేదనీ స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|