'చెదరని సంతకం పద్మనాభం'
హాస్యనటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా పద్మనాభం ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఇటీవల కన్నుమూసిన ఆయనకు నివాళులర్పించేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్వంలో హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సంతాపసభ ఏర్పాటు చేశారు.
సీనియర్ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పాలలోని స్వచ్ఛతలా పద్మనాభంది తెల్లటి నవ్వు అనీ, అపకారికి కూడా ఉపకారం చేసే నైజం ఆయనదని అన్నారు. పద్మనాభం మృదుస్వభావి అనీ, గతంలో రెండుసార్లు ఆయనను కలిసినప్పుడు పదిమందికి ఉపయోగపడమంటూ తనకు సూచించారని ఫిలించాంబర్ అధ్యక్షుడు సి.కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ, ఇటీవలనే హాస్యనటులంతా పద్మనాభంను సన్మానించుకున్నారనీ, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమనీ అన్నారు. సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ, ఆయనతో కలిసి ఎన్నో సినిమాల్లో తాను నటించాననీ, తనతో పాటు ఎందరెందర్నో ఆయన ప్రోత్సహించారనీ చెప్పారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, పద్మనాభం గొప్ప మానవతావాదనీ, ఆయన జన్మ ధన్యమైందనీ శ్లాఘించారు. ఎంతో ప్రతిభాపాటవాలున్న వ్యక్తి పద్మనాభం అనీ, చక్కటి అభిరుచితో పలు సినిమాలు కూడా ఆయన తీశారనీ బ్రహ్మానందం పేర్కొన్నారు. శివకృష్ణ, శివాజీరాజా, చిట్టిబాబు, కవిత, డబ్బింగ్ ఆర్టిస్చ్ కృష్ణసాగర్, సీనియర్ మేకప్ మన్ మాధవరావు తదితరులు ఈ సంతాప సభలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|