సినీ పరిభాషలో హీరో ఎంత ముదురు అయినా అతనికి జోడిగా కుర్రహీరోయిన్ ఉండాల్సిందే. అలా కాకుండా హీరోయిన్ కంటే హీరో చిన్నగా కనిపిస్తే మన కుర్రాడు కంటే కుర్రది ముదురులా ఉందంటూ ప్రేక్షకుడు పెదవి విరిచేస్తుంటారు. కొత్త కథలు, ప్రెజెంటేషన్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన టెక్నికల్ విజార్డ్ గౌతమ్ మీనన్ తాజాగా 'ఏమాయ చేసావె' అనే క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. హీరో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించింది. సమంతకు తెలుగులో ఇదే తొలిచిత్రం. అయితే నాగచైతన్య కంటే వయసులో పెద్దదట. అంటే కుర్ర హీరో...పెద్ద హీరోయన్ అన్నమాట. ఇదంతా రియల్ లైఫ్ లో కాదులెండి. రీల్ లైఫ్ లోనే. కథానుసారం ఇందులో నాగచైతన్య కంటే సమంత రెండేళ్లు పెద్దదట.
ఈ చిత్ర కథాంశం ఇంతవరకూ పూర్తిగా బయటకు రానప్పటికీ విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం...ఇందులో నాగచైతన్య పేరు కార్తీక్. ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. సినిమాల పట్ల అభిరుచి ఉన్న కార్తీక్ ఎప్పటికైనా మంచి దర్శకుడిగా అనిపించుకోవాలని అనుకుంటాడు. ఇది అతని తండ్రికి ఇష్టముండదు. కృష్ణుడు తనకున్న పలుకుబడితో పూరీ జగన్నాథ్ కు కార్తీక్ ను పరిచయం చేస్తాడు. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కార్తీక్ చేరుతాడు. ఈ క్రమంలోనే ఐటి కంపెనీలో పనేచేస్తున్న పక్కింటమ్మాయితో కార్తీక్ కు పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. చాలా ప్రేమకథల తరహాలోనే వీరి ప్రేమకు కూడా పెద్దల నుండి అభ్యంతరం ఎదురవుతుంది. కార్తీక్ కంటే అతని ప్రియురాలి వయసు రెండేళ్లు ఎక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణం. వారి ప్రేమ సుఖాంతమైందా? దు:ఖాంతమైందా? అనేది సస్పెన్స్. దర్శకుడు గౌతమ్ తనకున్న అలవాటు ప్రకారం ఈ చిత్రానికి కూడా రెండు క్లైమాక్స్ లు రెడీ చేసిపెట్టుకున్నారట. ఒకటి సుఖాంతం. రెండోది దు:ఖాంతం. ఆయన ఎంచుకున్న సినిమా క్లైమాక్స్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తే దానిని తొలగించి రెండో క్లైమాక్స్ ను తెరమీదకు తెస్తారట. ఈనెల 26న యూత్ ను మెస్మరైజ్ చేసేందుకు 'ఏమాయ చేసావె' థియేటర్లకు రానుంది.