బ్యాంకాక్ లో ఇవివి 'బురిడీ'
కామెడీ కథాచిత్రాలు తీయడంలో జంధ్యాల స్కూలు నుంచి వచ్చిన ఇవివి సత్యనారాయణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ సబ్జెక్ట్ తో ఆయన తీసిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. ఇటీవలే 'బెండు అప్పారావు' చిత్రం సక్సెస్ తో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న ఇవివి ఇప్పుడు దర్శకుడుగా 50వ మైలురాయికి చేరుకున్నారు. తాజాగా ఆయన 'బురిడీ' అనే పూర్తి హాస్య భరిత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి 'తెగ నవ్వించేస్తాడు' అనే తమాషా ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ బి ప్రొడక్షన్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈడ్పుగింటి పూర్ణచంద్రరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది.
ఇవివి ఆ వివరాలు తెలియజేస్తూ, తన దర్శకత్వంలో వస్తున్న 50వ చిత్రమిదనీ, ఇంతవరకూ తాను తీసిన కామెడీ సినిమాల్లో ది బెస్ట్ గా కెరీర్ లో గుర్తుండిపోతుందనీ అన్నారు. ఇంతవరకూ చేసిన కామెడీ సినిమాలతో పోలిస్తే ఈసారి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించబోతున్నామని అన్నారు. ఇవివి వంటి సీనియర్ డైరెక్టర్ తో సినిమా తీసే అవకాశం రావడం తమ అదృష్టమనీ, తెలుగు పరిశ్రమలోని హాస్యనటులంతా ఇందులో నటిస్తున్నారనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, రఘబాబు, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, ఏవియస్, జీవా, శివారెడ్డి, సుమన్ శెట్టి, తిరుపతి ప్రకాష్, బెనర్జీ, గుండు సుదర్శన్, హేమ, జ్యోత్స్న తదితరులు నటిస్తున్నారు. జనార్దన మహర్షి మాటలు, మోహన్-శ్రీనివాస్ రచనా సహకారం, శ్రీనివాసరెడ్డి కెమెరా, కోటి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|