అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కు 1972 నుంచి పలు భారతీయ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలను అందించిన క్రెడిట్ ఉంది. కొత్త ప్రయోగాలకు
ముందుడే గీతా ఆర్ట్స్ తొలిసారి ఈ సంస్థ నుంచి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన 'మగధీర' చిత్రాన్ని బ్లూ-రే డిస్క్ రూపంలో విడుదల చేయబోతోంది. ఇండియన్ మార్కెట్ లోకి బ్లూ-రే డిస్క్ రూపంలో విడుదలవుతున్న తొలి చిత్రం కూడా ఇదే కానుండటం విశేషం. గతంలో నాగార్జున 'కింగ్' చిత్రాన్ని బ్లూ-రే డిస్క్ రూపంలో భవాని డివిడి ద్వారా ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్లూ-రే వీడియో ప్లేయర్లు ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగానే వినియోగంలో ఉండటంతో బ్లూ-రే డిస్క్ లకు డిమాండ్ కూడా అంతగా లేదు. అయితే కొత్తదనాన్ని ప్రోత్సహించి, మార్కెట్ పొటెన్షియాలిటీని పెంచాలనే తపనతో గీతా ఆర్ట్స్ సంస్థ శ్రీ బాలాజీ వీడియోస్ తో కలిసి 'మగధీర' చిత్రాన్ని బ్లూ-రే డిస్క్ గా విడుదల చేయబోతోంది.
'మగధీర' డిస్క్ లకు బోనస్ గా అడిషనల్ ఫూటేజ్ ఉన్న డిస్క్ ను కూడా అందజేయబోతున్నారు. మార్చి మూడోవారంలో 'మగధీర' డివిడిలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత రెండు వారాలకు బ్లూ-రే డిస్క్ లు అందుబాటులోకి వస్తాయి. ఓవర్సీస్ వ్యూవర్స్ కోసం ఇండియా వెలుపల కూడా ఈ డిస్క్ లు లభించనున్నాయి.