'గీతాంజలి' గుర్తొచ్చింది: నాగ్
చాలారోజుల తర్వాత 'ఏ మాయ చేసావె' చిత్రం ఒక రొమాంటిక్ ఫెంటాస్టిక్ సినిమాను చూసిన అనుభూతిని కలిగించిందనీ, సినిమా ఇప్పుడే చూశాననీ, చాలా బాగుందనీ ప్రముఖ హీరో నాగార్జున తెలిపారు. నాగచైతన్య కథానాయకుడుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన 'ఏమాయ చేసావె' చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించిన నాగార్జున ఆ అనుభూతులను మీడియాతో బుధవారంనాడు పంచుకున్నారు.
'ఏమాయ చేసావె చిత్రాన్ని సినిమా చూస్తున్నప్పుడు అప్పట్లో నేను చేసిన గీతాంజలి చిత్రాన్ని ఫ్యాన్స్ అంతా చాలా బాగుందని మెచ్చుకోవడం గుర్తుకు వచ్చింది. గీతాంజలి చిత్రం కూడా అప్పట్లో ఫైట్స్ లేవనీ, ఇంకో ఏవోవే లేవని విమర్శించిన వాళ్లున్నారు. అయితే ఆ తర్వాత సినిమా చాలా పెద్ద మ్యూజికల్ హిట్టయింది. ఏమాయ చేసావే చిత్రంలోనూ ఫైట్స్ ఉండవు. గొప్ప ఫీల్ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఫీల్ అలాగే ఉండిపోతుంది. నాగచైతన్య సినిమా అని చెప్పడం లేదు. ఇంకెవరి సినిమాకి అయినా ఇలాగే స్పందిస్తాను. ఎ.ఆర్.రెహమాన్ తన సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. నాగచైతన్య చాలా నేచురల్ గా, పూర్తి ఎనర్జీతో నటించాడు. అలాగే కృష్ణుడు కూడా చాలా బాగా నటించాడు. అలాగే టెక్నికల్ గా గౌతమ్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో గీతాంజలి చిత్రం అన్ని కోణాల్లోనూ హైలైట్ అయింది. అలాంటి అన్ని హైలైట్స్ ఇందులో ఉన్నాయి. ఇందిరా ప్రొడక్షన్ నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి' అని నాగార్జున ఎంతో ఉద్వేగంగా చెప్పారు. ప్రధానంగా ఈ చిత్ర కథ హీరోహీరోయిన్ల మీదే నడుస్తుందనీ, ఇందులోని పాయింట్ చిన్నదే అయినా దానిని తెరకెక్కించిన తీరు గొప్పగా ఉందనీ, గౌతమ్ చాలా సెన్సెటివ్ గా ఈ సబ్జెక్ట్ ను డీల్ చేశారనీ తెలిపారు. నాగచైతన్య తొలిచిత్రం 'జోష్' చాలా అంచనాలతో రావడంతో ఆ అంచనాలను అందుకోలేకపోయిందనీ, అయితే ఈ చిత్రం అలా కాదనీ, నాగచైతన్యకు మంచి పేరు తెస్తుందనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్యూర్ లవ్ స్టోరీగా మాత్రమే చూడాలని అభిమానులకు ఆయన రిక్వెస్ట్ చేశారు.
Be first to comment on this News / Article!
|