'టిక్ టిక్ టిక్' మార్చి 12న
'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'అనసూయ', 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' వంటి సస్సెన్స్ థ్రిల్లర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇప్పుడు పలు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు నిర్మాణం జరుపుకొంటున్నాయి. ఈ కోవలో రూపొందిన చిత్రమే 'టిక్ టిక్ టిక్'. కృష్ణ భగవాన్, సైరాభాను, షరీఫ్, ప్రేమ, మాధవీ మీనన్, మధుమిత ప్రధాన పాత్రధారులు. అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై పి.అరుణకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణకాంత్ దర్శకుడు. ఉగాది కానుకగా మార్చి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అరుణకాంత్ తెలిపారు.
కొత్తరకం కథ, సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, ఇందులో హీరో ఎవరనే సస్పెన్స్ సినిమాచూసి తెలుసుకోవాల్సిందేననీ ఆయన అన్నారు. మణిశర్మ వద్ద సహాయకుడిగా పనిచేసిన యువ సంగీత దర్శకుడు కానూరి అద్భుతమైన బాణీలను అందించినట్టు తెలిపారు. శంకర్ దాదా అనే రౌడీ క్రికెట్ టీమ్ కోచ్ భగవాన్ సింగ్ ధోనిగా కృష్ణ భగవాన్ పాత్ర సినిమాలో ఓ ప్రధాన హైలైట్ అని అన్నారు. సైరాబాను, ప్రేమ, మధుమితలపై ఐదు పాటలను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరించామనీ, కొన్ని పాటలకు ప్రత్యేకమైన గ్రాఫిక్ వర్క్ కెనడాలో చేయించామనీ చెప్పారు. అలాగే 'మంత్ర', 'గమ్యం', 'చందమామ' చిత్రాలకు పనిచేసిన సాగర్ ఈ చిత్రానికి అందించిన సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకి మరో హైలైట్ అన్నారు. నటి అనుష్క చేతులమీదుగా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి సీతారామరాజు మాటలు, రాంబాబు పాటలు, ఎస్.డి.జాన్ సినిమాటోగ్రఫీ, అనిల్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|