మియాపూర్ లో 'బృందావనం'
సంక్రాంతికి 'అదుర్స్' చిత్రంతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఈ ఏడాది కనీసం ఇంకో రిలీజ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' చిత్రం తొలి షెడ్యూల్ ముగించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు 'బృందావనం' (గోవిందుడు అందరివాడేలే) చిత్రం తదుపరి షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఎన్టీఆర్ కు జోడిగా కాజల్ అగర్వాల్, మరో హీరోయిన్ గా సమంత ('ఏమాయ చేసావె' ఫేమ్) నటిస్తున్నారు. హైద్రాబాద్ లోని మియాపూర్ లో ప్రత్యేకంగా వేసిన హౌస్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఎన్టీఆర్ ఈ చిత్రంలో రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నారనీ, మాస్ ను మెప్పించే యాక్షన్ అంశాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మియాపూర్ లో శుక్రవారం వరకూ జరిగే షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ కేరళ, కర్నాటకు వెళ్తుంది. ఈనెల 28 నుంచి మార్చి 18 వరకూ అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆగస్టు లో సినిమా రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, శ్రీహరి, అజయ్ తదితరులు నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, థమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|