నిర్మాతపై ఛార్మి ఫిర్యాదు
'మాయగాడు' చిత్రం ప్రమోషన్ వర్క్ విషయంలో తలెత్తిన విభేదాలు ఆ చిత్ర కథానాయిక ఛార్మి, నిర్మాత యలమంచి రవిచంద్ మధ్య వివాదానికి దారితీసింది. రవిచంద్ తనను వేధింపులకు గురిచేశారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఛార్మి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఛార్మి తానో పెద్ద నటినన్న అహంతో సినిమా నిర్మాణంలో తనను ఎన్నో ఇబ్బందులకు గురించేసిందనీ, మూడున్నర కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీసి రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లోకి తనను నెట్టిందంటూ రవిచంద్ సైతం నిర్మాతల మండలికి ఛార్మిపై ఫిర్యాదు చేశారు.
వేణు, ఛార్మి జంటగా నటించిన 'మాయగాడు' చిత్రాన్ని సాంబశివ క్రియేషన్స్ పతాకంపై యలమంచి రవిచంద్ నిర్మించారు. దిలీప్ పోలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని చాలాకాలమే అయినా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ తరుణంలో చిత్రం ప్రమోషన్ వర్క్ కోసం ఛార్మిని రవిచంద్ సంప్రదించినప్పుడు ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో సమస్య మొదలైందని తెలుస్తోంది. సినిమా నిర్మాణ సమయంలో నిర్మాత కాస్ట్యూమ్స్ దగ్గర్నించీ పలు సందర్భాల్లో తనను ఇబ్బందులు పెట్టారనీ, సినిమాలో ఓవర్ ఎక్స్ పోజ్ చేసినట్టు తనను చూపించారనీ, ఆయనతో ఇకముందు పనిచేసేది లేదనీ ఛార్మి 'మా'కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. రవిచంద్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని తన భద్రత విషయంలో కూడా అమ్మానాన్నలు ఆందోళన చెందుతున్నారని కూడా ఆ ఫిర్యాదులో ఛార్మి పేర్కొంది. ఈ వాదనను రవిచంద్ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఛార్మి ప్రమోషన్ వర్క్ లో పాల్గొనడం వల్ల మంచి ఓపినింగ్స్ వస్తాయనే ఆశతో ఆమెను సంప్రదించాననీ, రానని చెబితే సరిపుచ్చుకునే వాడిననీ, ఇందుకు ప్రతిగా తనపై తీవ్ర ఆరోపణలు చేయడం తగదనీ ఆయన అన్నారు. ఈరోజు ఛార్మి ఈ స్థితికి రావడానికి నాలాంటి నిర్మాతలే కారణమనీ, తాను ఎలాంటి నిర్మాతనే విషయం పరిశ్రమలోని అందరికీ తెలుసనీ అన్నారు. 'మాయగాడు' షూటింగ్ కోసం ఫారెన్ వెళ్లినప్పుడు ఛార్మి తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో యూనిట్ అందిరకీ తెలుసననీ, మంచి నిర్మాత, మంచి బ్యానర్ లో చేస్తున్నానని అప్పట్లో ఆమె చెప్పడం మీడియాకు కూడా తెలుసనీ ఆయన అన్నారు. అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి ఛార్మిని తీసుకునే బదులు వేరే అమ్మాయిని అంతకంటే తక్కువ పారితోషికంతో తీసుకోవచ్చనీ, అయితే ఛార్మి మీద ఉన్న నమ్మకంతో పూర్తి పారితోషికం ఇచ్చి తీసుకుంటే అడుగడుగునా ఇబ్బందుల పాలు చేసిందన్నారు. కాస్ట్యూమ్స్ కొనుక్కుంటామని డబ్బులు తీసుకుని తన సొంత కాస్ట్యూమ్స్ వాడిందనీ, ఆలస్యంగా సెట్స్ కు వచ్చి తమను నిరీక్షించాలా చేసిందనీ ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రమోషన్ వర్క్ కోసం రమ్మని అడిగితే వేధించానంటూ కంప్లయింట్ ఇవ్వడం సరికాదని అన్నారు. రాజేందర్ ఫిర్యాదుతో పాటు ఛార్మి కంప్లయింట్ సైతం ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ పరిశీలనలో ఉంది.
Be first to comment on this News / Article!
|