నిర్మాతగా 'కిక్' శ్యామ్
రవితేజ కథానాయకుడుగా నటించిన 'కిక్' చిత్రం ఆయనతో పాటు ఆ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన తమిళ హీరో శ్యామ్ కు కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం తర్వాత ఆయన 'కిక్' శ్యామ్ గానే గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నిర్మాతగా కూడా మారారు. తమిళంలో 'అగమ్ పురమ్' అనే చిత్రంలో ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్నారు. దీనిని తెలుగులో 'గ్యాంగ్ వార్' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఐఆర్ బ్యానర్ పై శ్యామ్ సొంతంగా నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని శ్యామ్ తెలియజేస్తూ, తన తండ్రి ఎస్ఐ రాజా పేరుతో ఈ బ్యానర్ ను స్థాపించినట్టు చెప్పారు. ఇంతవరకూ తనకు ఛాక్లెట్ హీరో అనే ముద్ర ఉండేదనీ, 'గ్యాంగ్ వార్' చిత్రంతో యాక్షన్ హీరోగా మారాననీ చెప్పారు. తన ఆలోచనకు తగ్గట్టుగా దర్శకుడు తిరుమలై ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, ఈ చిత్రంలో అంతా కొత్త శ్యామ్ ను చూస్తారనీ ఆయన ధీమాగా చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రీలీజ్ చేయనున్నామని తెలిపారు. దీనితో పాటు 'కిక్' తమిళ రీమేక్ తిల్లాంగడి, ఇదే చిత్రం కన్నడ రీమేక్ లో హీరో సుధీప్ తోనూ నటిస్తున్నట్టు చెప్పారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందనున్న 'రాజశేఖర్ రెడ్డి' చిత్రంలో తాను ఎంపిక అయిన విషయాన్ని ధ్రువీకరిస్తూ ఏ నటుడికైనా జీవితకాలంలో వచ్చే ఒక మంచి అవకాశమిదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిందని తెలిపారు.
Be first to comment on this News / Article!
|