'హైస్కూల్' లవ్ 5న
పదహారేళ్ల కుర్రాడు ముఫ్పై ఏళ్ల టీచర్ తో ప్రేమలో పడే కథాంశంతో రూపొందిన చిత్రం 'హైస్కూల్'. కిరణ్ రాథోడ్, కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల '1940లో ఓ గ్రామం' చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైన దర్శకుడు సింహా నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై మల్లన్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.
నేటి యువతరం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే అంశాలను ఈ చిత్రంలో చర్చించామనీ, ఎలాంటి అశ్లీలత, అసభ్యతకు తావులేని చిత్రమిదనీ నిర్మాత మల్లన్న తెలిపారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్టు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుదని అన్నారు. కుటుంబ కథాంశంతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, యువతకు చక్కటి సందేశం కూడా ఇందులో ఉందనీ సింహా నంది తెలిపారు. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందనీ, పాటల చిత్రీకరణ కూడా గోవా, ఊటీ పరిసర ప్రాంతాల్లో చేశామనీ చెప్పారు. గుండు హనుమంతరావు, గౌతంరాజు, జెన్నీ, రజిత తదితరులు ఈ చిత్రంలో నటించారు. కల్యాణ్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|