'దాసన్నా' ఆడియో రిలీజ్
రియల్ స్టార్ శ్రీహరి, మీనా హీరోహీరోయిన్లుగా విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మించిన చిత్రం 'దాసన్నా'. దీనికి డి.ఎస్.పి. దర్శకత్వం వహించారు. మార్చి 12న 150 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆంధ్రజ్యోతి చైర్మన్ వేమూరి రాధాకృష్ణ, కర్నూలు ఎమ్మెల్యే టి.జి.వెంకటేష్, సూర్య పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావు, నటుడు ఆర్.నారాయణమూర్తి, ఫిల్మ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు బి.వి.రెడ్డి, శ్రీహరి, ఎంఎం శ్రీలేఖ, ఏసియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, శివరంజని మ్యూజిక్ అధినేత లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని వేమూరి రాధాకృష్ణ ఆవిష్కరించి తొలి ప్రతిని నూకారపు సూర్యనారాయణకు అందజేశారు. ఈ చిత్రం ఆడియో ద్వారా తొలిసారి మార్కెట్ లోకి అడుగుపెట్టిన శివవరంజని ఆడియోస్ లోగోను నూకారపు సూర్యనారాయణ ఆవిష్కరించారు. తొలి సీడీని కూడా ఆయన కొనుగోలు చేశారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో అందరికీ తెలిసిందేననీ, అలాంటి వాటిని తీసుకుని నట్టికుమార్ రిలీజ్ చేస్తుండటం ప్రశంసనీయమనీ అన్నారు. హీరో శ్రీహరి నిర్మాతల పాలిటి కల్పతరువనీ, మనసున్న మనిషనీ కొనియాడారు. తాను 'వీర తెలంగాణ' చిత్రం కోసం శ్రీహరిని సంప్రదించినప్పుడు ఆయన రెమ్యునరేషన్ కూడా అడక్కుండా ఎన్ని డేట్లు కావాలంటే అన్ని ఇవ్వడం తనను ఆశ్చర్యంలో ముంచెత్తిందని అన్నారు. వేమూరి రాధాకృష్ణ మాట్లాడుతూ, సామాజిక అంశాలను తీసుకుని శ్రీహరి సినిమాలు చేస్తుంటారనీ, వాటిని తాను ఆసక్తిగా తిలకిస్తుంటానని అన్నారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందనీ, మంచి సక్సెస్ సాధిస్తుందనీ అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్న సినిమాలు రిలీజ్ లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనీ, థియేటర్లు కూడా లభించడం లేదనీ నూకారపు సూర్యప్రకాశరావు అన్నారు. ఈ సమస్యలను సమష్టిగా అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. నూకారపు సూర్యప్రకాశరావు చెప్పినట్టు చిన్న సినిమాల సమస్యలపై అందరూ దృష్టి పెట్టాలని బివి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందులో ఆరు పాటలు ఉన్నాయనీ, అందర్నీ అలరింపజేస్తాయనీ శ్రీలేఖ పేర్కొన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, 'భద్రచలం' తర్వాత అంత బాగా కష్టపడి చేసిన సినిమా ఇదనీ, ఆ సినిమా ఆడియో పెద్ద హిట్టయినట్టే ఈ ఆడియో, సినిమా కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ చిత్రాన్ని నట్టికుమార్ ప్రమోట్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|