మహేష్ 'కలేజా' ఏప్రిల్ 9న?
మహేష్ బాబు ఫ్యాన్స్ రెండున్నరేళ్ల నిరీక్షణకు ఈ సమ్మర్ లో తెరపడనుంది. 'అతిథి' చిత్రం తర్వాత ఇంతవరకూ మహేష్ బాబు సినిమా ఒక్కటీ విడుదలకు నోచుకోకపోవడం ఆయన అభిమానుల తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తమ ఆవేదనను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు అభిమానులు ఇటీవల నివేదించుకున్నారు. మహేష్ సినిమాల విషయంలో ఇకముందు గ్యాప్ రాబోదని కృష్ణ భరోసా ఇచ్చినట్టు సమాచారం. మహేష్ సైతం ఇక నుంచి ఏడాదికి రెండు చిత్రాలు విడుదలయ్యే చూసుకునేందుకు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇంతవరకూ 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చి నుంచి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది.
యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. మహేష్ కు జోడిగా అనుష్క నటిస్తోంది. సింగనమల రమేష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చిలో జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ 9న సినిమా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు పట్టుదలగా ఉన్నారు. దీనికి తొలుత 'వరుడు', 'కిలాడీ' అనే పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి 'వరుడు', విశాల్ సినిమాకి 'కిలాడి' టైటిల్స్ ఖరారయ్యారు. ఈ నేపథ్యంలో మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి 'కలేజా' అనే టైటిల్ ను ఫైనలైజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|