మహేష్ సరసన సమంత?
తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన బ్యూటీ గాళ్ సమంత ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను 'ఏ మాయ చేసావె' చిత్రంతో కట్టిపడేస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మలయాళ అమ్మాయి జెస్సీగా సమంత యువ హృదయాలను గిలిగింతలు పెడుతోంది. ఇందులో అందంతో పాటు అభినయానికి కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర ధరించడంతో టైలర్ మేడ్ పాత్ర సమంతను వరించినట్టయింది. ముఖ్యంగా ఆమెకు సింగర్ చిన్మయ చెప్పిన డబ్బింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది. అనూహ్యంగా ఇప్పుడు పలువురు నిర్మాతలు సైతం సమంత కోసం క్యూలు కడుతున్నారు.
సమంత అందచందాలు, అభినయం 'ఏమాయ చేసావె' చిత్రానికి ప్రధాన ఎస్సెట్ అనీ, మహేష్ బాబుతో తాము నిర్మించబోయే తదుపరి చిత్రంలో కూడా సమంతను అనుకుంటున్నామని ఆ చిత్ర నిర్మాత మంజుల ప్రకటించారు. ప్రిన్స్ మహేష్ తో ఇంత త్వరగా నటించే అవకాశం సమంతకు రావడం లక్కీగానే చెప్పాలి. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నందున టాలీవుడ్ లో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు సమంత చెబుతోంది. దీంతో ఇవాల్టి యువతరం హీరోయిన్లకు సమంత నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు.
Be first to comment on this News / Article!
|