ఆస్ట్రేలియా వెళ్లిన చరణ్
'మగధీర' సెన్సేషన్ హిట్ తర్వాత రామ్ చరణ్ కథానాయకుడుగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.నాగేంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ ఆస్ట్రేలియాలో మొదలైంది. ఇందులో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. ఈ సోమవారం నుంచే ఈ చిత్రానికి సంబంధించిన 30 రోజుల కీలక షెడ్యూల్ మొదలైంది. ఇటీవలే ముంబైలో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరిపారు. 'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి హిట్ చిత్రాల దర్శకుడు భాస్కర్ కు ఇది హ్యాట్రిక్ ఫిల్మ్. రామ్ చరణ్ కు కూడా ఇది మూడో సినిమా కావడం విశేషం.
సున్నితమైన ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని భాస్కర్ తెరకెక్కించనున్నారనీ, రామ్ చరణ్ ఇందులో లవర్ బాయ్ తరహా లో, విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారనీ తెలుస్తోంది. దీనికి 'ఆరంజ్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. తొలుత అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాలని అనుకుని అక్కడి తెలుగు మాట్లాడే ఎన్ఆర్ఐ నటుల ఎంపిక కూడా చేశారు. కారణాంతరాల అమెరికాలో కాకుండా ఆస్ట్రేలియాలో షూటింగ్ ఫిక్స్ చేశారు. స్నిడీ, మెల్ బోర్న్ లో జరిగే తాజా షెడ్యూల్ లో కీలకమైన నటీనటులు పాల్గొంటారు. రామ్ చరణ్ కు జోడిగా జెనిలియా, మరో నాయికగా షాజాన్ పదంసీ నటిస్తున్నారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తోట ప్రసాద్ సంభాషణలు, కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, ఆనంద్ సాయి ఆర్ట్ , మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|