కేరళలో 'సుమధురం'
కళాతపస్వి కె.విశ్వనాథ్ 'స్వరాభిషేకం' తర్వాత చాలా కాలనికి తన 80వ పుట్టినరోజు కానుకగా ఓ కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. విశ్వనాథ్ చిత్రాలు సహజంగా 'ఎస్' అనే అక్షరంతో ప్రారంభమవుతుంటాయి. 'శంకరాభరణం', 'స్వాతిముత్యం', 'సిరివెన్నెల', 'సీతామాలక్ష్మి', 'స్వర్ణ కమలం', 'స్వాతిముత్యం', 'సాగరసంగమం', 'శుభలేఖ', 'స్వయంకృషి'వంటి పలు చిత్రాలు ఈ సెంటిమెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమయ్యాయి. విశ్వనాథ్ తన తాజా చిత్రానికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ 'సుమధురం' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో అల్లరి నరేష్, మంజరి ('సిద్దు ఫ్రమ్ సికాకుళం' ఫేమ్) జంటగా నటిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి సోమశ్వర ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై హరి గోపాలకృష్ణమూర్తి, పీలా నీల తిలక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల అన్నవరం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ జరుపుకొన్న ఈ చిత్రం మలి షెడ్యూల్ ను కేరళలో జరుపుకొంటోంది.
కళాత్మక చిత్రాలను అందించడంలో దిట్ట అయిన కళాతపస్వి కె.విశ్వనాథ్ నుంచి వస్తున్న మరో ఆణిముత్యం ఈ చిత్రమని నిర్మాతలు తెలిపారు. 'శుభలేఖ', 'సీతామాలక్ష్మి', 'శుభోదయం' తరహాలో హాయిగా వినోదాత్మకంగా సాగే చిత్రమిదని అన్నారు. ఈనెల 16 వరకూ కేరళలోని చాలకుడి, అలెప్పీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామనీ, ఇందులో భాగంగా రెండు పాటలు, హీరోయిన్ ఇంటికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ ఉంటుందనీ తెలిపారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో శరత్ బాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, రాళ్లపల్లి, గీతాంజలి, సుదర్శన్, జెన్నీ, విశ్వేశ్వరరావు, వైజాగ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. టి.సాయినాథ్ రచనా సహకారం, ఎం.వి.ఎస్.హరినాథరావు మాటలు, వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|