'లెనిన్' ఆడియో రిలీజ్
దేశ భవితకు యవతే పునాది. యువత బాగుంటే దేశం బాగుంటుంది. రాజకీయ విలువలు పరిరక్షించేందుకు నలుగురు యువకులు చేసిన పోరాటమే 'లెనిన్' ఇతివృత్తం. బ్రహ్మాజీ, పులి అమృత్, జాకీ, ఛత్రపతి శేఖర్, చిత్రం శ్రీను, స్వాతి, శ్వేత ప్రధాన పాత్రధారులు. సాయి సింధు క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ దర్శకత్వంలో రాగం నాగేందర్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ఫిలిం చాంబర్ లో మంగళవారం జరిగింది. నటుడు, దర్శకుడు పులి అమృత్ ఈ చిత్రానికి సంగీతం సైతం అందించారు. ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ అల్లం నారాయణ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ కు అందజేశారు.
అల్లం నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వాళ్లు చాలామంది ఉన్నారనీ, అయితే కొందరిలో పరిశ్రమ ఇక్కడ్నించి వెళ్లిపోతుందన్న అపోహ ఉందనీ అన్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల కంటే నిర్మాతలు, పరిశ్రమకు చెందిన వ్యక్తులు చాలా క్లారిటీతో ఉన్నారని అన్నారు. పరిశ్రమ పురోభివృద్ధికి అందరూ కలిసి పాటుపడదామని అన్నారు. పులి అమృత్ తీసిన 'లెనిన్' ఆడియోపరంగా, సినిమా పరంగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ తెలుగువారికోసం పుట్టిందనీ, కుల, మత, ప్రాంతీయ భేదాలకు ఇక్కడ తావులేదనీ అన్నారు. పులి అమృత్ ఏ ప్రాంతానికి చెందినవరో కూడా తెలియదని అన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా సక్సెస్ కావాలని అభిలషించారు. కథే ఈ చిత్రానికి హీరో అని పులి అమృత్ తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉన్నాయనీ, సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. మంచి కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇదని ఆర్.కె.గౌడ్, మోహన్ గౌడ్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|