రాజా ఆత్మహత్యాయత్నం?
'ఇంకోసారి' చిత్రానికి ఎదురైన ఇబ్బందులకు మనస్తాపం చెంది ఆ చిత్ర కథానాయకుడు రాజా ఆత్మహత్యా యత్నం చేశారనీ, అయితే సకాలంలో చిత్ర నిర్మాత ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారనీ తెలుస్తోంది. ఇది పబ్లిసిటీ స్టంటా? నిజంగానే సినిమాకి ఎదురైన ప్రతిబంధకాల పట్ల రాజా తీవ్ర మనోవేదనకు గురయ్యాడా అనేది స్పష్టంగా తెలియదు. అయితే రాజా, చిత్ర నిర్మాత కిరణ్ పల్లా, దర్శకుడు సుమన్ పాతూరి నేరుగా తమ ఆవేదనను మానవ హక్కుల సంఘానికి (హెచ్.ఆర్.సి.) నివేదించి...ప్రముఖ నిర్మాతలు, పంపిణీదారులు అయిన రామోజీరావు, దిల్ రాజు, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్ లపై ఫిర్యాదు చేయడం చర్చనీయమవుతోంది.
'చిన్న నిర్మాతల బతుకులను పరిశ్రమకు చెందిన ఈ నలుగురు బిగ్ డీలర్లు ఛిద్రం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మేజర్ థియేటర్లు వాళ్ల గుప్పిట్లోనో ఉన్నాయి. చిన్న నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేసుకుందామంటే థియేటర్లు దొరకడం లేదు. మేము తీసిన ఇంకోసారి చిత్రానికి కూడా ఇలాంటి విపత్కర పరిస్థితే ఎదురైంది. సినిమాపై చాలా ఖర్చుపెట్టాం. థియేటర్లు దొరకలేదు. మనస్తాపం చెందిన రాజా ఆత్మహత్యా యత్నానికి పాల్పడాలనుకున్నప్పుడు వారించాను. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేద్దామని ఆయనను వెంట పెట్టుకుని వచ్చాను' అని నిర్మాత కిరణ్ పల్లా తన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కంప్లయింట్ అందినట్టు మానవ హక్కుల సంఘం చైర్మన్ సుభాషన్ రెడ్డి చెబుతూనే...దీనిపై ఒక నిర్ణయానికి రావడానికి కూలంకషంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందనీ, అయితే ఇది సినిమాటోగ్రఫీ చట్టం పరిధిలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల సరైన హిట్లు లేని రాజా 'ఇంకోసారి' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారనీ, హెచ్.ఆర్.సి.కి ఇచ్చిన కంప్లెయింట్ లో వారి ఆవేదనకు కొంత సహేతుకత ఉన్నప్పటికీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కు చెందిన వ్యవహారానికీ, హెచ్ఆర్ సికి సంబంధం ఏమిటనేది కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కోర్టులు...ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ను అప్రోచ్ అయి ఉండవచ్చని వారంటున్నారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|