క్రీడా నేపథ్యంలో 'లాహోర్'
దేశాల మధ్య జరిగే క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించాలనీ, యుద్ధ వాతావరణాన్ని తలపించరాదనే సందేశంతో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'లాహోర్'. అనాహర్, షారూఖ్ షేక్, శ్రద్ధాదాస్, సఫిసా అలీ ముఖ్య పాత్రలు పోషించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వివేక్ ఖత్ కార్, జె.ఎస్.రాణా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ పూరన్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఆడియో సీడిని చిత్ర నిర్మాత ఆవిష్కరించి బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయకు అందజేశారు.
సంజయ్ పూరన్ సింగ్ మాట్లాడుతూ, కిక్ బాక్సింగ్, క్రికెట్ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రీడలంటే రెండు దేశాల వారు ఒక యుద్ధంలా భావిస్తారనీ, ఇది భావ్యం కాదనీ, క్రీడలు రెండు దేశాల మధ్యా స్నేహబంధాన్ని మాత్రమే పెంపొందించాలనీ ఇందులో చెప్పామని అన్నారు. ఈనెల 19న సినిమా రిలీజ్ ఉంటుందన్నారు. ఇది క్రీడల నేపథ్యమే అయినా ఒక పరిపక్వత చెందిన ప్రేమ కథ అని చిత్ర కథానాయకుడు అనాహత్ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ, ఈ చిత్రంలో శంకర్ మహదేవన్, దలేర్ మెహందీతో కలిసి పనిచేశాననీ, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఇండియా-పాక్ దేశాల మధ్య క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, రమేష్ ప్రసాద్, సునీల్ శర్మ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|