ఐశ్వర్య రాయ్ పోలికలతో 'లక్కీ' చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంటూ వచ్చింది. 'ఉత్సాహంగా ఉల్లాసంగా' తొలి హిట్ ను సొంతం చేసుకుని ఇటీవలే యువ ఆడియెన్స్ లో 'కరెంట్' పుట్టించింది. ఇప్పుడు అగ్రహీరో బాలకృష్ణ సరసన 'సింహా'లో నటిస్తూ తన కెరీర్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోబోతోంది. తాజాగా స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. అయితే హీరోయిన్ గా గాకుండా ఇందులో ఓ పాటలోనే ఆమె కనిపించబోతోంది.
అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వరుడు' కోసం ఇటీవలే ఈ స్పెషల్ సాంగ్ ను అల్లు అర్జున్, స్నేహ ఉల్లాల్ పై చిత్రీకరించారు. నిర్మాతలు ఈ విషయాన్ని గుట్టుగానే ఉంచుతున్నప్పటికీ ఈ సాంగ్ ఈ చిత్రంలో ఓ హైలైట్ అవుతుందట. దీనికితోడు పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా 'వరుడు' విడుదల కానుంది.