ఆప్త రక్షకుడు బెల్లంకొండ!
గట్స్ ఉన్న నిర్మాతగా పేరున్న బెల్లంకొండ సురేష్ ఏకకాలంలో రెండు మూడు చిత్రాలు నిర్మిస్తూ...మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన దృష్టి కన్నడ 'ఆప్త రక్షక' చిత్రంపై పడింది. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల కన్నడంలో విడుదలై సంచలన విజయం సాధించింది. కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్దన్ నటించిన ఆఖరి సినిమా కూడా ఇదే. కన్నడ 'ఆప్త మిత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. ఆ చిత్రాన్ని అప్పట్లో పి.వాసు 'చంద్రముఖి' పేరుతో తమిళ, తెలుగు భాషల్లో రూపొందించి విజయకేతనం ఎగుర వేశారు. తాజా నేపథ్యంలో 'ఆప్త రక్షక' చిత్రాన్ని 'చంద్రముఖి-2' పేరుతో రీమేక్ చేసేందుకు వాసు పట్టుదలగా ఉన్నారు. తొలి వెర్షన్ లో నటించిన రజనీకాంత్ ను మలి వెర్షన్ కు ఒప్పిచేందుకు కొద్దికాలంగా ఆయన ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రజనీ ఇంకా ఎటూ తేల్చిచెప్పలేదు. రజనీ కాదంటే మరో సూపర్ స్టార్ తో ద్విభాషా చిత్రంగా దీన్ని తీయాలని వాసు ప్లాన్ చేస్తున్నారు. ఆసక్తికరంగా తెలుగు వెర్షన్ తీసేందుకు బెల్లంకొండ ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన వాసుతో సంప్రదించి పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ గా చెల్లించినట్టు సమాచారం.
'ఆప్త రక్షక' చిత్రం విడుదలకు ముందు అందులో నటించిన విష్ణువర్దన్, 'ఆప్తమిత్ర' సమయంలో నటి సౌందర్య మరణించడంతో సెంటిమెంట్ గా 'చంద్రముఖి' సీక్వెల్ కు రజనీ విముఖంగా ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. రజనీ ఇదే పట్టు మీద ఉంటే ఆయనకు ప్రత్యామ్నాయంగా బొల్లంకొండ మనసులో ఉన్న సదరు 'టాప్ స్టార్' ఎవరనేది తేలాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.
Be first to comment on this News / Article!
|