బ్యాంకాక్ వెళ్తున్న 'హాసిని'
మానవ సంబంధాల్లోని భావోద్వేగాలతో పాటు చిలిపితనం, సెంటిమెంట్ వంటి అంశాలను మేళవించి 'హాసిని' చిత్రంలోని కథానాయిక పాత్రను తీర్చిదిద్దినట్టు దర్శకుడు బి.వి.రమణారెడ్డి తెలిపారు. సంధ్య ('ప్రేమిస్తే' ఫేమ్), కమలాకర్ ('అభి' ఫేమ్) హీరోహీరోయిన్లుగా కమల్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. మరో వైపు ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో సోమవారంనాడు చిత్రయూనిట్ ఆ వివరాలను తెలియజేసింది.
బివి రమణారెడ్డి మాట్లాడుతూ, ఇందులోని హాసిని పాత్రలో భిన్న కోణాలు ఉంటాయనీ, కమలాకర్ పాత్ర చిన్నదైనప్పటికీ అతనికి మంచిపేరు వస్తుందనీ అన్నారు. పరిశ్రమలో పేరున్న హాస్యతారాగణమంతా ఇందులో నటించారనీ, టోటల్ గా ఇదొక క్లీన్ ఎంటర్ టైనర్ అనీ చెప్పారు. గతంలో తమ బేనర్ నుంచి 'అభి', 'సఖి' చిత్రాలు తీసినట్టు బూచేపల్లి సుబ్బారెడ్డి, చిత్ర సమర్పకురాలు బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.చక్రి కంపోజ్ చేసిన పాటలన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. హీరో కమలాకర్ మాట్లాడుతూ, మిగిలిన రెండు పాటలు మంగళవారం నుంచి బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నామని, ఈనెల 18వరకూ చిత్రీకరణ జరుగుతుందనీ చెప్పారు. ఈ నెలాఖరులో ఆడియో, ఏప్రిల్ ద్వితీయార్థంలో సినిమా విడుదలవుతుందన్నారు. ఈ సమావేశంలో సంధ్య, మాటల రచయిత మరుధూరి రాజా, ప్రాజెక్ట్ డిజైనర్ సి.వెంకట్, కళా దర్శకుడు కె.వి.రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|