'ఆప్తరక్షక'లో చిరంజీవి?
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు పి.వాసు ఇప్పుడు 'ఆప్త రక్షక'తో సంచలన రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన తొలి వారమే 6 కోట్లకు పైగా వసూలు చేయడం, ఇటీవలే చెన్నైలో ఈ చిత్రం ప్రీమియర్ చూసిన రజనీ సైతం వాసును మెచ్చుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్దన్ కు ఇది చివరి చిత్రం కావడం కూడా బాక్సాఫీస్ సక్సెస్ లో కీలక భూమిక వహించింది. కన్నడ 'ఆప్తమిత్ర'కు సీక్వెల్ గా వాసు దీనిని రూపొందించారు. 'ఆప్తమిత్ర' తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్ కథానాయకుడుగా 'చంద్రముఖి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో 'ఆప్తరక్షక' చిత్రాన్ని మళ్లీ రజనీకాంత్ తోనే తమిళంలో 'చంద్రముఖి-2'గా తీయాలని వాసు పట్టుదలగా ఉన్నారు. ఇదే క్రమంలో తెలుగు వెర్షన్ ను నిర్మించేందుకు నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ మొత్తాన్ని వాసుకు ఆఫర్ చేసినట్టు సమాచారం.
కన్నడ వెర్షన్ లో రజనీకాంత్, తెలుగు వెర్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశాలున్నాయంటూ ఫిల్మ్ నగర్ లో తాజాగా బలమైన ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టటంతో సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్లీ 'చంద్రముఖి-2'తో రీ-ఎంట్రీ ఇస్తే బాక్సులు బద్దలవుతాయనీ, ఇప్పటికీ ఆయనపై జనాల్లో ఉన్న అభిమానం చెక్కుచెదరలేదని మరోసారి నిరూపితమవుతుందనీ అంటున్నారు. ఫిల్మ్ మేకర్ వాసు, మెగాస్టార్ చిరంజీవి మనసులో ఏముందనేది వేచిచూడాలి...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|