స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కాబోయే 'వధువు' ఎలా ఉండబోతోందనే సస్పెన్స్ ఇక వీడినట్టే కనిపిస్తోంది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాకుండా రీల్ లైఫ్ ముచ్చటే కావడం విశేషం. అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన 'వరుడు' చిత్రం ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇందులో వధువు...అంటే హీరోయిన్ ఎవరనేది ఇంతవరకూ దర్శకనిర్మాతలు బయటపెట్టలేదు. అల్లు అర్జున్ పెళ్లి పీటల మీద కూర్చునే స్టిల్స్ మాత్రమే పబ్లిసిటీకి వాడుకుని వధువు ఎవరనేది గుట్టుగా ఉంచి ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుకుంటూ వచ్చారు. దీనికి తెరదించుతూ ఆ అజ్ఞాత హీరోయిన్ ఎవరనేది ఇంటర్నెట్ ద్వారా తాజాగా బయటకు వచ్చింది. ఆమె పేరు భాను మెహ్రాగా చెబుతున్నారు.
మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్ భాను మెహ్రా ఇటీవల బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఓ చిత్రంలో చిన్న పాత్ర పోషించనట్టు సమాచారం. ఆమెనే ఇప్పుడు తెలుగు తెరకు హీరోయిన్ గా గుణశేఖర్ పరిచయం చేయబోతున్నారట. ఆ మధ్య ఇంటర్నెట్ ద్వారా విడుదలైన ఓ పాట పవన్ కల్యాణ్ 'పులి' చిత్రంలో దంటూ ప్రచారం జరిగి ఆ తర్వాత అదంతా ఉత్తదేనని తేలినట్టు ఇప్పుడు కూడా భాను మెహ్రా పేరు పైకొచ్చి ఉండొచ్చా అనేది మరి కొద్దిరోజుల్లోనే తేలనుంది.