'ఏమాయ..' ట్రెండ్ సెట్టర్
ఇవాల్టి తెలుగు సినిమాలకు ఓ కొత్త ట్రెండ్ తీసుకు వచ్చే విధంగా 'ఏమాయ చేసావె' చిత్రం ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సుమంత్, మంజుల, సంజయ్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న కథను తీసుకుని ఇవాల్టి ట్రెండ్ లో దానిని గొప్పగా తెరకెక్కించడం ప్రశంసనీయమనీ, ఎన్నో ప్రేమకథలు చేసిన తనకు ఆయా పాత్రల్లోని వైవిధ్యం తెలుసుననీ అక్కినేని అన్నారు. నాగచైతన్య కంటే ఇందులో సమంత పాత్ర చాలా క్లిష్టమైనదనీ, ఇది 'గీతాంజలి' కంటే మంచి సినిమా అనీ ప్రశంసించారు. లోపాలను సరిదిద్దుకుంటూ వెళ్తే నాగచైతన్య భవిష్యత్తులో మంచి నటుడుగా రాణిస్తారని అన్నారు. ఇంత మంచి సినిమాను తన తనయుడు నాగచైతన్యకు ఇచ్చినందుకు మంజుల, సంజయ్ స్వరూప్ లకు తన కృతజ్ఞతలని నాగార్జున అన్నారు. ఈ చిత్రం విడుదల సమయంలో తాను కులమనాలిలో ఉన్నాననీ, ఎందరెందరో పోన్లు చేసి సినిమా బాగుందని మెచ్చుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో కథానాయిక జెస్సీ పాత్ర కోసం మరో రెండు మూడు సార్లు సినిమా చూస్తానని చెప్పారు. 'గీతాంజలి' సినిమాతో నాగచైతన్యకు అనుబంధం ఉందని సుమంత్ పేర్కొన్నారు. ఆ సినిమా వచ్చినప్పుడే అతను పుట్టాడని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన వారికి అందులో నటీనటులు కాకుండా ఆ పాత్రలు, వాటిపేర్లే గుర్తుకు రావడం ఆనందంగా ఉందన్నారు. రెండు సినిమా కుటుంబాల నుంచి వచ్చిన చిత్రమిదనీ, నాన్నగారు కూడా ఎంతో సంతోషించారని మంజుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి, కృష్ణుడు, ఆచంట గోపి, వక్కంతం వంశీ, అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|