'చంద్రముఖి-2'లో సమీరా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహజంగా తన చేతిలో ఉన్న సినిమాను పూర్తి చేసిన వెంటనే హిమాలయాల దారి పడుతుంటారు. ఆ ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్ట్ లోకి అడుగుపెడతారు. ఈసారి మాత్రం ఆయనకు ఆ అవకాశం చిక్కేట్లు లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రోబో' తుది మెరుగుల దశలో ఉంది. ఇది పూర్తి కాగానే ఆయనను 'చంద్రముఖి-2' సెట్స్ లోకి అడుగుపెట్టేలా చేయాలని పి.వాసు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పి.వాసు కన్నడంలో ఇటీవల తీసిన 'ఆప్త రక్షక' సూపర్ హిట్ అయింది. ఇది ఆయన దర్శకత్వంలోనే వచ్చిన 'ఆప్తమిత్ర'కు సీక్వెల్. 'ఆప్తమిత్ర' చిత్రాన్నే రజనీకాంత్ తో 'చంద్రముఖి'గా పి.వాసు గతంలో ప్రేక్షకులకు అందించారు. ఆ చిత్రం రెండు భాషల్లోనూ హిట్టయింది. ఈ క్రమంలో 'ఆప్తరక్షక' చిత్రాన్ని 'చంద్రముఖి-2'గా తమిళంలో రూపొందించాలని వాసు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. రజనీ ఇంకా ఇతమిత్ధంగా తేల్చిచెప్పనప్పటికీ ఆ చిత్రంలో రజనీ ఎలా ఉండబోతున్నారో చూపించే క్యారిక్యాచర్స్ ను తయారు చేయించి ఆయనకు చూపించేందుకు వాసు సన్నాహాలు చేస్తున్నారు. పనిలో పనిగా 'చంద్రముఖి' ఎవరనేది కూడా వాసు ఇప్పటికే డిసైడ్ అయ్యారని సమాచారం.
హిందీ, తమిళ, తెలుగు భాషల్లో గ్లామర్ నటిగా పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డిని ఇందులో చంద్రముఖిగా నటింపజేయాలని వాసు ప్లాన్ చేస్తున్నారు. ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని స్కెచ్ లు కూడా ఆయన రెడీ చేసినట్టు తెలుస్తోంది. రజనీ వంటి సూపర్ స్టార్ తో నటించే అవకాశం రావడమంటే సమీరా పంట పండినట్టే. రజనీ చిత్రాలకు ఓవర్సీస్ డిమాండ్ కూడా ఎక్కువే కావడంతో సమీరా అక్కడ కూడా పాపులర్ కావచ్చు. అన్నట్టు...ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఉండబోతున్నారు.
Be first to comment on this News / Article!
|