నిర్మాతగా రాఘవ లారెన్స్
సక్సెస్ ఫుల్ కొరియాగ్రాఫర్ నుంచి నటుడుగా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు తెలుగులో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన వరుస చిత్రాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి వెంచర్ గా 'కాంచన' అనే చిత్రాన్ని ఆయన ప్రకటించారు.
అనుష్క ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం ఉంటుందనీ, ఇందులో తాను హీరోగా నటిస్తాననీ ఆయన తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ చిత్రంలో తనకు మరో హీరోయిన్ ఉంటుందని వివరించారు. ఈ చిత్రాన్ని ఆయన తన సొంత బ్యానర్ లో, స్వీయ దర్శకత్వంలో నిర్మించనుండటం విశేషం. ఏప్రిల్ లో ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. అనుష్క ప్రస్తుతం సముద్ర 'పంచాక్షరి', క్రిష్ 'వేదం', త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'కలేజా' చిత్రాల్లో నటిస్తోంది. 'పంచాక్షరి' తర్వాత అనుష్క నటించనున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'కాంచన' కాబోతోంది. 2006లో లారెన్స్ చేసిన 'ముని' చిత్రానికి ఇది సీక్వెల్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్ ల కోసం లారెన్స్ స్క్రిప్టు రచన చేస్తున్నారు. ఏది ముందుగా రెడీ అయితే ఆ చిత్రం లారెన్స్ నిర్మాణ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లారెన్స్ కథానాయకుడుగా నటిస్తున్న 'సూపర్ కౌబాయ్' తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.
Be first to comment on this News / Article!
|