హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీహరి ఇవాల్టి యువతరం హీరోల చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలు పోషిస్తూ రెండు వైపులా సత్తా చాటుతున్నారు. ఆయన కథానాయకుడుగా నటించిన చిత్రం 'దాసన్నా'. ఆయనకు జంటగా మీనా నటించింది. విశాఖ టాకీస్ పతాకంపై డి.ఎస్.పి. దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. హైద్రాబాద్ లో శ్రీహరితో బుధవారం జరిపిన ముఖాముఖి...
?'దాసన్నా' ఎలాంటి వాడు
-ధైర్యంగా ఉంటూనే అందరికీ ధైర్యాన్నిచ్చే వ్యక్తే దాసన్న. నా కెరీర్ లో ఈ తరహా క్యారెక్టర్ ఇంతవరకూ చేయలేదు. ఆంజనేయుడుకు ఎంత శక్తి ఉందే అతనికి తెలియదు. అలాగే దాసన్న శక్తి కూడా అతనికి తెలియదు. రాముడంటే ఆంజనేయుడికి అపరిమిత నమ్మకం. ఆయన కూడా ఆంజనేయుడి పట్ల అలానే ఉంటాడు. ఇందులో రాముడు లాంటి వ్యక్తిని ఆంజనేయుడు లాంటి దాసన్న నమ్ముతాడు. అయితే తను నమ్మిన ఆ వ్యక్తే దాసన్నను మోసగిస్తే అతను ఆ విపత్కర పరిస్థితి నుండి ఎలా బయటపడ్డాడన్నదే ఈ చిత్రం.
?ఇందులో 'చంటి' సినిమా పోలికలు కనిపిస్తున్నాయని అంటున్నారు
- అలాంటిదేమీ లేదు. వాస్తవానికి 'చంటి' చాలా పెద్ద హిట్ సినిమా. దానితో పోలిస్తే మంచిదే కానీ రెండు చిత్రాలకూ ఎలాంటి పోలికలు లేవు. ఇదో విభిన్నమైన చిత్రం.
?నిర్మాణంలో జాప్యం జరిగింది కదా
- నిజమే. కారణాంతరాల వల్ల జాప్యం జరిగింది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మాత నట్టికుమార్ ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఆయనకు నా సంపూర్ణ సహకారం ఇస్తున్నాను. నా సినిమాకు నాకంటే ఎక్కువగా ఆయన కష్టపడుతున్నారు. దాదాపు 150 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని ప్రింట్లతో నా సినిమా ఏదీ గతంలో రిలీజ్ కాలేదు. ఈ సినిమా ఓ చరిత్ర సృష్టిస్తుందనే గట్టి నమ్మకం ఉంది.