బ్రహ్మగా రాజేంద్రప్రసాద్
పౌరాణిక పాత్రలకు ఆహార్యం, వాచకం అవసరం. నటకిరీటి రాజేంద్రప్రసాద్ గతంలో శ్రీకృష్ణుడుగా, శ్రీమహావిష్ణువుగా, ఆంజనేయుడుగా కొన్ని పౌరాణిక పాత్రలు పోషించి మెప్పించారు. ఈసారి బ్రహ్మదేవుడుగా అలరించబోతున్నారు. సోషియో ఫాంటసీ 'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం) అనే చిత్రంలో ఆయన విధాతగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ తో పాటు శివాజీ, సోనియా, ఆర్తి అగర్వాల్, కల్యాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్, రూపేష్, డి.గోహిల్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం ప్రోగ్రస్ ను దర్శకుడు వివరిస్తూ, సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందనీ, సినిమా చాలా రిచ్ గా వస్తోందనీ చెప్పారు. ముఖంగా రాజేంద్రప్రసాద్ పోషిస్తున్న బ్రహ్మ పాత్ర అద్భుతంగా ఉంటుందన్నారు. వినోదమే ప్రధానంగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి ఎందరో మహానుభావులు ఎన్నో పౌరాణిక పాత్రలు చేశారనీ, వాళ్లిద్దరూ చేయని బ్రహ్మదేవుని పాత్రను ఇందులో రాజేంద్రప్రసాద్ నభూతో నభవిష్యతి అన్నట్టుగా పోషించారనీ చెప్పారు. బ్రహ్మ దేవుని ఇందులో నాలుగు తలలు ఉంటాయనీ, నాలుగూ తలలు లైవ్ గా ఉన్నట్టు చిత్రీకరించామని తెలిపారు. ఇందుకు అవసరమైన గ్రాఫిక్ వర్క్ కూడా జరుగుతోందన్నారు. ఈ చిత్రానికి భాస్కర భట్ల పాటలు, వాసు సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్, ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|