సుప్రీంకు దక్కిన 'ఆరంజ్ '
ఆడియో రంగంలో నుంచి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి ఇటీవల ఓవర్సీస్ సినీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన సుప్రీం సంస్థ అధినేత సుప్రీం రాజు ఇప్పుడో గోల్డెన్ ఆఫర్ ను దక్కించుకున్నారు. 'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న 'ఆరంజ్' చిత్రం ఓవర్సీస్ రైట్స్ ను ఆయన కైవసం చేసుకున్నారు. అలాగే మ్యూజిక్ రైట్స్ కూడా దక్కించుకున్నారు. మహాత్మ లేబిల్ మీద ఈ చిత్రం ఆడియోను ఆయన విడుదల చేస్తారు. ఓవర్సీస్, మ్యూజిక్ రైట్స్ ను 3.25 కోట్ల రూపాయలు చెల్లించి ఆయన దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.నాగేంద్రబాబు ప్రతిష్టాత్మకంగా రూపొందింస్తున్న 'ఆరంజ్' చిత్రం ఇటీవల ముంబైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 30 రోజుల కీలక షెడ్యూల్ జరుపుకొంటోంది. 'బొమ్మరిల్లు', 'పరుగు' చిత్రాల తర్వాత దర్శకుడు భాస్కర్ కు ఇది హ్యాట్రిక్ ఫిల్మ్. సున్నితమైన ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. 'ఓ' రేంజ్ లో ఉండే లవ్ స్టోరీ కాబట్టి ఆ అర్ధం వచ్చేలా 'ఆరంజ్' టైటిల్ ను నిశ్చయించారని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్లేబాయ్ తరహా పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన జోడిగా జెనీలియా, మరో నాయికగా షాజాన్ పదంసీ నటిస్తున్నారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తోట ప్రసాద్ మాటలు, కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, ఆనంద్ సాయి ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|