టిఆర్పీలో 'చంద్రముఖి' టాప్
బుల్లితెరపై 'చంద్రముఖి' సీరియల్ మంచి సక్సెస్ సాధిస్తోందని ఆ సీరియల్ దర్శకుడు యాట సత్యనారాయణ (వైఎస్) తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఇటీవల 750 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని టి.ఆర్.పి. రేటింగ్ లో నెంబర్ వన్ స్థానం చెక్కుచెదరకుండా నిలబెట్టుకుంటోందని చెప్పారు. ఇందువల్లనే వెయ్యి ఎపిసోడ్ల వరకూ సీరియల్ ను కొనసాగించాలని ఛానెల్ అధినేతలు నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఈ సీరియల్ ను ఆర్కా మీడియో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దేవినేని ప్రసాద్, యార్గగడ్డ శోభు నిర్మిస్తున్నారు. పాటలు, ఫైట్స్ ఉన్న ఏకైక సీరియల్ ఇదేనని ఈ సందర్భంగా యాట సత్యనారాయణ పేర్కొన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యునిగా 12 ఏళ్లుగా పలు సినిమాలకు తాను కో-డైరెక్టర్ గా పనిచేశాననీ, ఆ అనుభవంతోనే ఈ సీరియల్ కు దర్శకత్వం వహించాననీ ఆయన తెలిపారు. ఇందులో యశోధర తను ఎవరినైతే ప్రేమించిందో అతని ప్రేమను పొందలేక నీలాంబరిగా గడిపేస్తుందనీ, కానీ అతనిపై కక్ష వయస్సుతో పాటే పెరుగుతుందనీ అన్నారు. దాన్ని అతని బిడ్డపై తీర్చుకోవాలని, తనకు దక్కని ప్రేమ అతని కుమార్తెకు కూడా దక్కకూడదని చంద్రముఖిని వేధిస్తుందనీ, ఈ నేపథ్యంలో సాగే కథాగమనమే ఈ సీరియల్ అనీ చెప్పారు. ఇందులో పలువురు సినీ నటులు నటించారనీ, ఇటీవల బ్రహ్మానందం ఫోన్ చేసి తన టేకింగ్ ను ప్రశంసించారనీ పేర్కొన్నారు. రచయిత పరూచూరి గోపాలకృష్ణ కూడా ఈ సీరియల్ చూసి మెచ్చుకున్నారనీ, ఇంతగా ఆదరిస్తున్న బుల్లితెర వీక్షకులకు తన కృతజ్ఞతలనీ అన్నారు. ఈ సీరియల్ లో పరిటాల నిరుపమ్, మంజు, ప్రీతినిగమ్, చలపతిరాజు, అశోక్ రావు, జాకీ, శ్రీవాణి, దుర్గాప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|