వెంకటేష్ తో 'ఆప్తరక్షక' రీమేక్
కన్నడంలో ఆల్ టైమ్ హిట్ గా రికార్డులు సృష్టిస్తున్న 'ఆప్తరక్షక' తెలుగు వెర్షన్ లో ఏ హీరో నటించనున్నారనే సస్పెన్స్ కు తెరపడింది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా ఇందులో నటిస్తారని నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు. ఒరిజనల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన పి.వాసు ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే 'ఆప్తరక్షక' తెలుగు రీమేక్ రైట్స్ ను బెల్లంకొండ సొంతం చేసుకున్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, 'చంద్రముఖి' వంటి సెస్సేషన్ హిట్ తర్వాత పి.వాసు కన్నడంలో అందించిన 'ఆప్తరక్షక' సూపర్ డూపర్ హిట్ అయి 40 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తన బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు చెప్పారు. వెంకటేష్ కు ఈ సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటుందనీ, ఆయన ఈ చిత్రం చూడగానే ఎంతో ఇన్ స్పైర్ అయి వెంటనే చేస్తాననడం ఆనందంగా ఉందనీ తెలిపారు. గతంలో పి.వాసు కథతో వెంకటేష్ చేసిన 'చంటి' చిత్రం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిందని, మళ్లీ ఇప్పుడు వెంకటేష్, వాసు సూపర్ కాంబినేషన్ లో 'ఆప్తరక్షక' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం రావడం తన అదృష్టమనీ అన్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మేలో ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
Be first to comment on this News / Article!
|