ఎన్టీఆర్ మహామనిషి : జమున
పాతతరం నటీమణుల్లో శ్రీమతి జమున ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పాతికేళ్ల పాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జమున పేరు చెబితే ఆమె నటించిన సత్యభామ పాత్ర ఠక్కున గుర్తొస్తుంది. 14 ఏళ్ల ప్రాయంలోనే 'పుట్టిల్లు' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణుడుగా నటిస్తే...సత్యభామ పాత్రకు జమున ప్రాణప్రతిష్ట చేసేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్ వంటి ప్రముఖ నటులతో ఆమె నటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన జమున పలు చిత్రాల్లో తల్లి పాత్రలు కూడా పోషించారు. తాజాగా ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుకు జమున ఎంపికయ్యారు. ఈ శుభ తరుణంలో ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం. అవార్డు లభించిన అనుభూతిని ఆమె తన మాటల్లో తెలియజేశారు.
మహిళాదినోత్సవ కానుక
ఎన్టీఆర్ నా తోటి నటుడు మాత్రమే కాదు. మహానటుడు. సాంఘికాలు, పౌరాణిక, జానపద చిత్రాలు, ఆయా పాత్రలతో ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నటీమణులను ఏనాడూ ఏకవచనంతో ఆయన పిలిచేవారు కాదు. ప్రపంచ స్థాయిలో తెలుగువారికి ఓ ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన మహానాయకుడు కూడా. అప్పట్లో ఆయన మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళగా ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక కావడం మధురానుభూతిని కలిగిస్తోంది. నన్ను ఇంతగా ఆదరించిన పరిశ్రమ, తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, అభిమానించిన ప్రేక్షకులకే ఈ అవార్డు క్రెడిట్ దక్కుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, అవార్డుల ఎంపిక కమిటీకి నా ధన్యవాదాలు.
ఎన్నడూ విభేదించలేదు...
ఎన్టీఆర్ తో నాకు ఎప్పుడూ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. వేర్వేరు పార్టీల్లో ఉండటం వల్ల విధానపరమైన నిర్ణయాల పరంగా విమర్శించిన సందర్భాలు మాత్రం ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ ఓ భోళా శంకరుడు.
పరిపూర్ణమైన జీవితం నాది...
నా వారసులు సినిమాల్లోకి రాలేదని కొందరు అడుగుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా పిల్లల ఇష్టం. మా వారు రమణరావు గారు ప్రొఫెసర్ గా పనిచేయడంతో ఆయన వారసత్వాన్ని మా అబ్బాయి పుణికి పుచ్చుకున్నారు. కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అమ్మాయి కూడా తన అభిరుచికి తగ్గట్టుగా వేరే రంగాన్ని ఎంచుకుంది. సినిమారంగం పరంగా కానీ నిజ జీవితపరంగా కానీ పరిపూర్ణమైన జీవితం నాది. అలాగే హైద్రాబాద్ లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తొలి నటిని కూడా నేనే. 40 ఏళ్ల క్రితమే మద్రాసులో ఉన్న ఆస్తులు అమ్మేసి హైద్రాబాద్ లో ఇల్లు కట్టుకున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కోరిక. అందుకు తగ్గట్టే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ముదావహం.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|