అల్లు అర్జున్ 'వరుడు' 31న
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో యూనివర్శల్ మీడియా పతాకంపై గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'వరుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని బ్యాలెన్స్ పాటను హైద్రాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ తో పాటు చిత్ర కథానాయిక, మరో 50 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు.
'ఖమ్మం దాటి వచ్చేసాక గుమ్మం తొక్కి తలుపెయ్యాలా..ఓరుగల్లే ఓడించాక ఒయ్యారాలే దులిపెయ్యాలా..'అంటూ సాగే పాటను అమ్మరాజ శేఖర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నామనీ, దీంతో షూటింగ్ పూర్తవుతుందనీ నిర్మాత దానయ్య తెలిపారు. సెన్సార్ ముగించి ఈనెల 31న రిలీజ్ చేయాలనుకుంటున్నామనీ, ఇప్పటికే ఆడియో పెద్ద హిట్ కావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం యూనిట్ సభ్యులందరిలోనూ ఉందని చెప్పారు. అల్లు అర్జున్ కు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. సుహాసిని, నరేష్, సింగీత శ్రీనివాసరావు, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా ఇందులో గెస్ట్ లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆడి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|