ఏప్రిల్ రెండో వారంలో 'సింహా'
'బొబ్బిలి సింహం', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'లక్ష్మీనరసింహా' వంటి చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం 'సింహా'. బాలకృష్ణ సరసన నయనతార, స్నేహ ఉల్లాల్ నమిత కథానాయికలు. రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ఈనెల 17 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాటల చిత్రీకరణ జరుగనుంది.
పరుచూరి కిరీటి మాట్లాడుతూ, ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో బాలకృష్ణ-నమిత-స్నేహ ఉల్లాల్ పై ఓ పాట, బాలకృష్ణ-స్నేహ ఉల్లాల్ పై మరో పాట చిత్రీకరించనున్నామనీ, దీంతో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. మరోవైపు రీరికార్డింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మార్చి నెలాఖరులో ఆడియో, ఏప్రిల్ రెండో వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. బాలయ్యబాబు క్యారెక్టర్ పేరులోనే 'సింహా' ఉంటుందనీ, ఆయనను ఓ కొత్త డైమెన్షన్ లో చూపించనున్నామనీ బోయపాటి శ్రీను తెలిపారు. బాలయ్యబాబు ఇంతవరకూ చేయనటువంటి విభిన్న మైన క్యారెక్టర్ ను ఇందులో అద్భుతంగా పోషించారని చెప్పారు. భద్ర, తులసి చిత్రాల తర్వాత దర్శకుడిగా తనకు ఇది హ్యాటిక్ హిట్ ఫిలిం అవుతుందన్నారు. సినిమా చాలా బాగా వస్తోందనీ, బోయపాటి టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉందనీ, బాలయ్యబాబు అద్భుతమైన నటన ప్రదర్శించారనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు తెలిపారు. ఈ బేనర్ లో సింహా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘు, కోట శ్రీనివాసరావు, మలయాళ విలన్ సాయికుమార్, ఆదిత్య మీనన్, కెఆర్ విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, కృష్ణభగవాన్, ఝాన్సీ, సన, సైరాబాను తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం బోయపాటి శ్రీను అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్థర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ పైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|