'మాయాబజార్' హాఫ్ సెంచరీ
చరిత్ర పునరావృతమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమ మరోసారి సంబరాలు జరుపుకొనే తరుణమిది. ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసి తెలుగు సినిమా 'ఎన్ సైక్లోపిడియా' అనిపించుకున్న విజయా వారి 'మాయాబజార్' మరోసారి రంగుల్లో తన సత్తా చాటుకుని మరో నాలుగు రోజుల్లో అర్ధ సెంచరీ కొట్టబోతోంది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో 1957లో విడుదలైన ఈ వెండితెర దృశ్యకావ్యం కొత్త సొబగులతో కలర్, సినిమాస్కోప్, డిటిఎస్ టెక్నాలజీతో గత జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ దాదాపు మూడు సంవత్సరాలు శ్రమించి కలిరింగ్ ప్రక్రియ పూర్తి చేసి తెలుగు ప్రేక్షకుల ముందుంచింది. దీనిని సూపర్ గుడ్ సంస్థ తెలుగులోకి విడుదల చేసింది.
ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్., ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సిఎస్ఆర్, ముక్కామల, మిక్కిలినేని వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం మరోసారి చరిత్రను క్రియేట్ చేస్తూ కలర్ లో సంచలన విజయాన్ని చేజిక్కించుకుంది. నాటితరం ప్రేక్షకులు ఆ చిత్ర వైభవాన్ని రంగుల్లో చూసుకుని మురిసిపోతే, ఊహించని విధంగా నేటితరం ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. పలు కొత్త చిత్రాలు సైతం 'మాయాబజార్' ధాటికి విలవిల్లాడాయి. అర్ధ శతదినోత్సవానికి చేరువవుతున్న తరుణంలోనూ 'మాయాబజార్' తనదైన శైలిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకుంటోంది. ఇదే జోరులో శతదినోత్సవం కూడా జరుపుకొంటే కలర్ లో తొలిసారి వచ్చిన చిత్రంగానే కాకుండా తొలి సెంచరీ జరుపుకొన్న చిత్రంగా కూడా 'మాయాబజార్' సరికొత్త రికార్డులను సృష్టించినట్టే.
Be first to comment on this News / Article!
|